మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

- January 28, 2026 , by Maagulf
మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన తాజా క్యాబినెట్ సమావేశంలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన పరిణామాలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్ (PA) అప్పన్న బ్యాంక్ ఖాతాలోకి సుమారు రూ.4.5 కోట్లు జమ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు.ఈ నిధుల బదిలీకి, నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టులకు మధ్య ఉన్న సంబంధం పై లోతైన విచారణ జరపాలని నిర్ణయించారు.

ఈ చర్చ సందర్భంగా కల్తీ నెయ్యి తయారీ వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెండర్లు దక్కించుకున్న కొన్ని డెయిరీలు కేవలం లాభాపేక్షతో, నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి రసాయనాలతో కూడిన నెయ్యిని సరఫరా చేసినట్లు మంత్రులు వెల్లడించారు. జంతువుల కొవ్వు మరియు ఇతర హానికర రసాయనాలను వినియోగించి నెయ్యిని తయారు చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే అంశంపై సిట్ (SIT) విచారణను మరింత వేగవంతం చేయాలని క్యాబినెట్ అభిప్రాయపడింది.

ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “గత ప్రభుత్వ పెద్దలు తప్పులు చేసి, ఇప్పుడు ఆ నెపాన్ని మన మీదకు నెట్టేందుకు ప్రయత్నిస్తారని, మంత్రులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు. ప్రతి విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, పవిత్రమైన తిరుమల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.విచారణలో ఎవరి పాత్ర తేలినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దీంతో ఈ నెయ్యి కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారితీసేలా కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com