రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం

- February 20, 2026 , by Maagulf
రాకేష్ బోద్ధులకు \'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రాంగణంలోని కళా సుబ్బారావు కళా వేదికపై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ నిర్వహణలో ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కే.విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఘనంగా పురస్కార ప్రదాన సభ జరిగింది. విశ్వనాథ్ సినిమాల పై రచయిత, విలేకరి రాకేష్ బోద్ధుల రచించిన గ్రంథానికి గుర్తింపుగా ‘వంశీ విశ్వనాథ్ కళా తపస్వి జాతీయ పురస్కారం’ అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు పురస్కారాన్ని ప్రదానం చేసి ప్రసంగించారు. విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రాలలో పాటల్లో మాత్రమే కాకుండా సంభాషణలలో కూడా సాహిత్య సుగంధం పరిమళిస్తుందని పేర్కొన్నారు. తెలుగు భాషకు పట్టాభిషేకం చేసిన దర్శకుల్లో విశ్వనాథ్ ముందువరుసలో ఉంటారని అన్నారు. వంశీ సంస్థలతో విశ్వనాథ్‌కు ఆత్మీయ అనుబంధం ఉందని, ప్రతిష్ఠాత్మక ‘వంశీ బర్కిలీ అవార్డు’కు ‘శంకరాభరణం’ చిత్రం అన్ని విభాగాల్లో ఎంపికైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

యువ రచయిత రాకేష్ బోద్ధుల విశ్వనాథ్ చిత్రాలపై శ్రద్ధతో ‘కళా తపస్వి కళా భరణాల’ పేరుతో రచించిన గ్రంథం అపురూపమని వంశీ రామరాజు అభినందించారు. రాకేష్ మాట్లాడుతూ, విశ్వనాథ్ సినిమాలపై తాను తెలుసుకున్న విశేషాలను అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని రచించానని తెలిపారు. పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వి.ఆర్.కే. ఫణి, జి.ఎ.శాస్త్రి, రవీందర్, శ్రీధర్, నిషిజ రమణి, ఇందిర, మంగతాయారు, రాధిక తదితరులు విశ్వనాథ్ చిత్రాలలోని మధుర గీతాలను ఆలపించి సభను రంజింపజేశారు. కార్యక్రమాన్ని వంశీ సంస్థల ట్రస్టీ సుంకరపల్లి శైలజ పర్యవేక్షించారు.

కళాతపస్వి కే.విశ్వనాథ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ సభ సినీ, సాహిత్య రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com