ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!

- October 01, 2026 , by Maagulf
ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!

మస్కట్: ఒమన్‌లో ఆరోగ్య సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన ఆరోగ్య సంస్థల సంఖ్య 2,464కు చేరింది. 2024తో పోలిస్తే ఇది 3.4 శాతం పెరుగుదల అని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల చేసిన హెల్త్ స్టాటిస్టిక్స్ 2026 నివేదిక వెల్లడించింది. 2025లో దేశవ్యాప్తంగా మొత్తం 80 ఆరోగ్య సంస్థలు కొత్తగా చేరాయి. వీటిలో అత్యధికంగా మస్కట్ గవర్నరేట్‌లో 21 సంస్థలు ఉన్నాయి.   

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఆసుపత్రుల సంఖ్య కూడా పెరిగింది. 2024లో 94గా ఉన్న ఆసుపత్రుల సంఖ్య 2025లో 98కి చేరింది. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. మొత్తం ఆరోగ్య సిబ్బందిలో ఒమనీల వాటా 51 శాతంగా ఉంది. ఒమానీ వైద్యుల సంఖ్య 2024లో 3.8 వేలుగా ఉండగా, 2025లో 12 శాతం పెరిగి సుమారు 4.3 వేలకు చేరింది.

ఆరోగ్య సేవల వినియోగం కూడా పెరిగింది. 2025లో ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థల్లో ఔట్‌పేషెంట్ సేవలను వినియోగించిన వారి సంఖ్య 16.1 మిలియన్లకు చేరింది. 2024లో ఇది 15.6 మిలియన్లుగా ఉండగా, ఏడాదిలో 3 శాతం పెరిగింది. మంత్రిత్వ శాఖ ఆసుపత్రుల్లో నిర్వహించిన శస్త్రచికిత్సల సంఖ్య కూడా 9 శాతం పెరిగి 101.7 వేలకు చేరింది. 2024లో ఈ సంఖ్య 93.1 వేలుగా ఉంది.

డయాలసిస్ సేవలు 5% పెరుగుదల

2024తో పోలిస్తే 2025లో డయాలసిస్ సెషన్ల సంఖ్య 5 శాతం పెరిగి సుమారు 4.01 లక్షలకు చేరింది. డయాలసిస్ యూనిట్లు ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంస్థల సంఖ్య కూడా 32కు పెరిగింది. అలాగే, రక్తదాతల సంఖ్య 2024-25 మధ్య 1.4 శాతం పెరిగింది. 2025లో దేశంలోని మొత్తం రక్తదాతల్లో దాదాపు 50 శాతం మస్కట్ గవర్నరేట్‌కు చెందినవారే. మొత్తం రక్తదాతల్లో ఒమనీల వాటా 82.7 శాతంగా ఉంది.

తల్లులు, శిశువుల మరణాల రేటులో తగ్గుదల

ఒమానీ మహిళల్లో ప్రసవ సంబంధిత మరణాల రేటు 2024లో ప్రతి లక్ష లైవ్ బర్త్‌ లకు 14.5గా ఉండగా, 2025లో 11.3కి తగ్గింది. 2025లో ఒమానీ మహిళల ఫెర్టిలిటీ రేటు 2.8గా నమోదైంది. శిశు మరణాల రేటు కూడా తగ్గింది. 2024లో ప్రతి 1,000 లైవ్ బర్త్‌ లకు 8.0గా ఉన్న శిశు మరణాల రేటు 2025లో 7.4కి తగ్గింది. 2025లో ఒమన్ మొత్తం జనాభా పుట్టినప్పుడు అంచనా జీవన కాలం 78.6 సంవత్సరాలుగా నమోదైంది.

గుండె సంబంధిత వ్యాధులే..

2025లో ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆసుపత్రుల్లో నమోదైన మరణాల సంఖ్య 3,992గా ఉంది. వీటిలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు ప్రధాన మరణ కారణంగా నిలిచాయి.

ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయం కూడా పెరిగింది. 2024లో సుమారు RO 1.084 బిలియన్గా ఉన్న మొత్తం ఆరోగ్య రంగ వ్యయం 2025లో RO 1.162 బిలియన్లకు చేరింది. ఇది 7.2 శాతం పెరుగుదల నమోదైంది.

హెల్త్ స్టాటిస్టిక్స్ 2026 నివేదికలో ఒమన్ ఆరోగ్య సంస్థలు, వైద్య సిబ్బంది, ఆరోగ్య సేవలు, పునరుత్పత్తి ఆరోగ్యం, అనారోగ్యం, మరణాలు, ఆరోగ్య రంగానికి సంబంధించిన ఆర్థిక గణాంకాలు తదితర అంశాలకు సంబంధించిన 2025 గణాంకాలను పొందుపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com