అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- March 16, 2026
అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళిగా అమరావతిలో ప్రతిష్టించిన ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ (త్యాగ విగ్రహం) ఆవిష్కరణ తనకెంతో గర్వకారణమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.యువగళం పాదయాత్రలో ఆర్యవైశ్య సోదరులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, కేవలం 194 రోజుల్లోనే ఈ బృహత్తర విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన సాగించిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ప్రతీకగా 58 అడుగుల ఎత్తులో ఈ కాంస్య విగ్రహాన్ని రూపొందించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరిగిన ఈ వేడుకలో లోకేశ్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం మరియు గుర్తింపు లభించాయని కొనియాడారు. ఆయన త్యాగం మరువలేనిదని, అందుకే ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అని నామకరణం చేశామని వివరించారు. ఈ విగ్రహం అమరావతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పొట్టి శ్రీరాములు నిస్వార్థ పోరాటాన్ని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడమే కాకుండా, అంటరానితనంపై, దళితుల ఆలయ ప్రవేశం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. 1952లో మద్రాసులో ఆయన చేపట్టిన దీక్ష ఢిల్లీ పీఠాన్ని కదిలించిందని, ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది పడిందని తెలిపారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ అభివర్ణించినట్లుగా, భారతదేశ చిత్రపటాన్ని మార్చిన ‘భారతదేశ మెర్కాటర్’ పొట్టి శ్రీరాములు అని లోకేశ్ అభివర్ణించారు.
ఆర్యవైశ్యుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందులో భాగంగానే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కోరిక మేరకు పొట్టి శ్రీరాములు స్మారక నాణెం విడుదల కోసం కేంద్రంతో చర్చిస్తున్నామని వెల్లడించారు.విగ్రహంతో పాటు రాబోయే ఏడాది కాలంలో స్మృతివనం, మ్యూజియం, ఆడిటోరియం మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









