ఎగ్జిట్‌ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు

- March 30, 2026 , by Maagulf
ఎగ్జిట్‌ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు

విమాన ప్రయాణంలో తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. IndiGoకు చెందిన ఒక విమానంలో గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.ఈ ఘటనతో విమానంలోని ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బంది వెంటనే ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

గాల్లో ఉండగానే డోర్ తెరవాలన్న ప్రయత్నం
శనివారం IndiGo 6E185 విమానం బెంగళూరు నుంచి వారణాసి వైపు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన సుమారు 15 నిమిషాల తర్వాత ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ అద్నాన్ అనే ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వద్దకు వెళ్లి దానిని తెరవడానికి ప్రయత్నించాడు.

అతని చర్యను గమనించిన క్యాబిన్ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకున్నారు. దీంతో విమానంలోని ప్రయాణికులు కొంతసేపు భయాందోళనకు గురయ్యారు. అయితే సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి చక్కబడింది.

విమానం వారణాసి చేరుకునే సమయానికి కూడా ఆ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించినట్లు సమాచారం. విమానం సుమారు 500 అడుగుల ఎత్తులో ఉండగా మరోసారి ఎమర్జెన్సీ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం ఇచ్చారు. పరిస్థితి నియంత్రణలో ఉండేలా పైలట్ కొంతసేపు విమానాన్ని గాల్లోనే తిప్పినట్లు తెలుస్తోంది.

చివరికి విమానాన్ని వారణాసిలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం ఆ ప్రయాణికుడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుడి వింత వ్యాఖ్య
పోలీసుల విచారణలో ఆ ప్రయాణికుడు ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాను ఎందుకు అలా ప్రవర్తించానో తనకే తెలియదని, తనకు దెయ్యం ఆవహించిందని చెప్పడంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com