దుబాయ్: దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చే దిశగా ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్‌ను ఆమోదించారు. ఈ ప్యాకేజ్ ఏప్రిల్ 1 నుంచి వచ్చే మూడు నుంచి ఆరు నెలల పాటు అమల్లోకి రానుంది.
ఈ చర్యల ద్వారా దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో రెసిలియన్స్, రెడీనెస్, అజిలిటీ మరింత పెంపొందుతాయని అధికారులు తెలిపారు. వ్యాపారాలు, కుటుంబాలు, వ్యక్తులకు నమ్మకం మరియు స్థిరత్వం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
అదే సమావేశంలో 2025 సంవత్సరానికి సంబంధించిన దుబాయ్ ఆర్థిక పనితీరును కూడా సమీక్షించారు. గత ఏడాదితో పోలిస్తే జీడీపీ 5.4 శాతం వృద్ధితో AED 937 బిలియన్‌ను దాటింది అని వెల్లడించారు. ఇది దుబాయ్ ఆర్థిక బలాన్ని మరోసారి చాటిచెప్పిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
“వ్యక్తులు, కుటుంబాలు, వ్యాపారాలకు పూర్తి మద్దతు అందించడంలో దుబాయ్ కట్టుబడి ఉంది. బలమైన సంస్థలు, సమాజంతో ఉన్న గాఢ అనుబంధంతో సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ మరింత బలంగా ముందుకు సాగుతోంది” అని షేక్ హమ్దాన్ స్పష్టం చేశారు.