యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- March 30, 2026
హైదరాబాద్: నిజాంపేటకు చెందిన వ్యాపారవేత్త సింహాద్రి శివానంద్‌ను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు, పక్కా పథకం ప్రకారం మోసగించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మంత్రి బాలకృష్ణ అనే వ్యక్తి 2021లో బాధితుడికి పరిచయమయ్యాడు. తొలుత చిన్న మొత్తంలో అప్పులు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తూ శివానంద్ నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఆ తర్వాత తనకు ‘శ్రీరామ్ దేవ్ బాబా యాపిల్ ఏజెన్సీ’లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయని, అందులో డబ్బు పెడితే నెలకు 3 శాతం వడ్డీతో పాటు అదనపు లాభాలు వస్తాయని నమ్మబలికాడు. ఈ మాటలు నిజమని నమ్మిన బాధితుడు వివిధ విడతల్లో ఏకంగా రూ. 5.7 కోట్లు నిందితుడి ఖాతాకు బదిలీ చేశారు.
ఒప్పందం ప్రకారం లాభాలు ఇవ్వకపోగా, అసలు సొమ్ము అడిగితే నిందితుడు బాలకృష్ణ ముఖం చాటేశాడు. చివరకు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. ఈ మోసంలో బాలకృష్ణ భార్య కవిత, బంధువు ఎడపల్లి రమేష్ కూడా కీలక పాత్ర పోషించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి పెట్టుబడిదారులను ఆకర్షించడంలో, నమ్మకం కలిగించడంలో సహకరించినట్లు తెలుస్తోంది. మోసపోయానని గ్రహించిన శివానంద్ సైబరాబాద్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఆశ్రయించగా, నిందితులపై కేసు నమోదైంది. ఇదే తరహాలో వీరు మరికొందరిని కూడా ‘యాపిల్ బిజినెస్’ పేరుతో బురిడీ కొట్టించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బాధితుడి నుండి కాజేసిన సొమ్మును రికవరీ చేసేందుకు వారి బ్యాంకు ఖాతాలను, ఆస్తులను పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, భారీ లాభాల ఆశ చూపే స్కీమ్‌ల పట్ల ప్రజలు మరియు వ్యాపారవేత్తలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా వ్యాపారంలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు సదరు సంస్థల రిజిస్ట్రేషన్ వివరాలు, గత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే ప్రతిపాదనల వెనుక ఇలాంటి మాయగాళ్లు ఉండే అవకాశం ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









