ఏపీ హై కోర్ట్: విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకూడదు
- April 05, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దేవాలయాల పవిత్రత మరియు అర్చకుల నియమావళిపై ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. విదేశీ యానం చేసిన అర్చకులు దేవాలయాల్లోని ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీలు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్లు మరియు శృంగేరి శారదా పీఠం అందించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మరియు కమిషనర్లకు హైకోర్టు దిశానిర్దేశం చేసింది. జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారు.
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి చెందిన పారాయణదారు సుబ్రహ్మణ్యం సోమయాజి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు అందించిన ప్రామాణికం ప్రకారం.. నిత్యం త్రికాల సంధ్యావందనం, వేదాధ్యయనం మరియు కఠిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించేవారు మాత్రమే గర్భాలయ పూజలకు అర్హులు. విదేశాలకు వెళ్లిన వారు మన సనాతన సంప్రదాయాలకు భిన్నంగా క్షవరం చేయించుకోవడం లేదా జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేస్తే, వారు గర్భగుడిలో పూజలు చేసే అర్హతను కోల్పోతారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
ఒకవేళ అర్చకులు అనివార్య కారణాల వల్ల విదేశాలకు వెళ్లాల్సి వస్తే, వారు తిరిగి వచ్చిన తర్వాత కేవలం దేవాలయం వెలుపల జరిగే వ్రతాలు, ఉత్సవాలు లేదా ఇతర పూజా కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. అంతేకాని, పవిత్రమైన గర్భాలయంలోకి వెళ్లి మూలవిరాట్టుకు పూజలు చేసేందుకు వారికి అనుమతి ఉండదు. 2010లో దేవాదాయ శాఖ జారీ చేసిన ధార్మిక పరిషత్ సర్క్యులర్‌ను ఇప్పటికీ చాలా చోట్ల తుంగలో తొక్కుతున్నారని, దానిని కచ్చితంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మార్గదర్శకాలను అనుసరించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని కోర్టుకు విన్నవించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







