ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- July 13, 2026
ఇబ్రీ: ఒమన్ ఆహార భద్రత వ్యూహంలో అల్ ధాహిరా గవర్నరేట్ కీలక కేంద్రంగా ఎదుగుతోంది. ప్రభుత్వం–ప్రైవేటు రంగం సమన్వయంతో ఆధునిక సాంకేతికత ఆధారంగా వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ స్థానిక ఆహార ఉత్పత్తిని పెంచే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది.
అల్ ధాహిరా అగ్రికల్చర్, జలవనరుల డైరెక్టర్ జనరల్ డాక్టర్ తలాల్ బిన్ జహ్రాన్ అల్ బుసైదీ ప్రకారం.. ప్రస్తుతం గవర్నరేట్‌లో 67 ఆహార భద్రత పెట్టుబడి ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం పెట్టుబడి విలువ OMR84 మిలియన్లు.
2026లో మరిన్ని భారీ పెట్టుబడులు
2026లో OMR37.5 మిలియన్ల నుంచి OMR50 మిలియన్ల మధ్య కొత్త పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వ్యవసాయం, పశుసంవర్ధక, జలవనరుల రంగాల్లో నాణ్యమైన ప్రాజెక్టులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇబ్రీలో విస్తృత ప్రాజెక్టులు
ఇబ్రీలో గ్రీన్‌హౌస్ వెజిటేబుల్ సాగు, ఖర్జూర తోటలు, పశుగ్రాసం ఉత్పత్తి, పశుసంవర్ధక, పౌల్ట్రీ, టిష్యూ కల్చర్ ప్రయోగశాలలు, నీటి బాట్లింగ్ యూనిట్లు, ఎరువుల తయారీ, వెటర్నరీ ఆసుపత్రులు, టేబుల్ ఎగ్ ఉత్పత్తి వంటి అనేక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఇవి ఆహార సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచుతున్నాయి.
ధాంక్, యాంకుల్‌లోనూ అభివృద్ధి
ధాంక్‌లో ఖర్జూరం, ఉల్లిపాయలు, బంగాళాదుంప, వెల్లుల్లి, కూరగాయల సాగు, ఆహార ప్రాసెసింగ్, పశుసంవర్ధక, టేబుల్ ఎగ్ ఉత్పత్తితో పాటు పది కీలక ప్రాజెక్టులు అమలవుతున్నాయి.
యాంకుల్‌లో ద్రాక్ష, అత్తి పండ్ల సాగు, ఖర్జూర ఉత్పత్తి, పశుసంవర్ధక, పశుగ్రాసం సాగు, ఫుడ్ ప్రాసెసింగ్, చేపల మార్కెట్ నిర్వహణ, నీటి శుద్ధి, బాట్లింగ్ వంటి తొమ్మిది ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి
ఇకపై కేవలం ఉత్పత్తి పెంపుకే కాకుండా, సార్టింగ్, ప్యాకేజింగ్, నిల్వ, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులు వంటి వాల్యూ చైన్ అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు డాక్టర్ అల్ బుసైదీ తెలిపారు. పాడి, మీట్ ప్లాంట్స్, పశుగ్రాస తయారీ, స్టోరేజ్ కేంద్రాలు, రిప్రిజిరేషన్ గోడౌన్లు, స్మార్ట్ వ్యవసాయం, ఆహార పరిశ్రమల విస్తరణ ద్వారా జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటాను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా, 2026 కోసం ‘తత్వీర్’ (Tatweer) వేదికపై 36 కొత్త పెట్టుబడి ప్రాజెక్టులను ప్రకటించారు. ఇబ్రీ ఇండస్ట్రియల్ సిటీ (మదాయిన్)లో ఫుడ్ ప్రాసెసింగ్, సేంద్రీయ ఎరువుల తయారీకి సంబంధించిన 11 పెట్టుబడి అవకాశాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







