ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు

- April 06, 2026 , by Maagulf
ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా వర్షాలు కురుస్తున్నప్పటికీ, ప్రమాదకరమైన పిడుగులు మరియు ఈదురు గాలుల పట్ల రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రానున్న కొద్ది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

తీవ్రమైన ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల జాబితాను అధికారులు విడుదల చేశారు.శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ఒకవైపు వర్షాలు, పిడుగుపాటులు ఉండగా.. మరోవైపు వడగాలుల హెచ్చరికలను కూడా ఏపీఎస్‌డీఎంఏ జారీ చేసింది. పోలవరం జిల్లాలోని చింతూరు, ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 66 మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. 

మన్యం జిల్లాలోని వీరఘట్టం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరుపాలెంలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి, తిరుమల, ఏలూరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com