అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..

- April 12, 2026 , by Maagulf
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..

అమెరికా, ఇరాన్ మధ్య గత రెండు వారాలుగా కొనసాగుతున్న యుద్ధ విరామం ముగియడంతో, శాశ్వత ఒప్పందం కోసం ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆదివారం (ఏప్రిల్ 12) నాడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ చర్చలు విఫలమైనట్లు అధికారికంగా ప్రకటించారు. అమెరికా ప్రతిపాదించిన కఠిన నిబంధనలకు ఇరాన్ అంగీకరించలేదని, అందుకే ఒప్పందం కుదరకుండానే తమ బృందం వాషింగ్టన్ వెనుతిరుగుతోందని వెన్స్ స్పష్టం చేశారు.

ఈ చర్చల్లో అమెరికా ప్రధానంగా ఒకే ఒక్క డిమాండ్ ముందు ఉంచింది. భవిష్యత్తులో ఇరాన్ ఎన్నటికీ అణు ఆయుధాలను తయారు చేయబోమని, అందుకు అవసరమైన పరికరాలను కూడా సేకరించబోమని లిఖితపూర్వకమైన, బలమైన హామీ ఇవ్వాలని కోరింది. ప్రస్తుత అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేసి, దీర్ఘకాలికంగా అణ్వాయుధ రహిత దేశంగా ఉండాలన్నది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అయితే, ఇరాన్ ఈ కఠిన షరతులకు లొంగకపోవడంతో 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి.

చర్చలు విఫలమవ్వడం అమెరికా కంటే ఇరాన్ కే ఎక్కువ నష్టమని జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. తాము అన్ని విధాలా సహకరించామని, సాధ్యమైనంత వరకు ఫ్లెక్సిబుల్ గా ఉంటూ ఇరాన్ కు ఒక ఉత్తమమైన ఆఫర్ ఇచ్చామని ఆయన తెలిపారు. కానీ ఇరాన్ ప్రతినిధులు ఈ సదవకాశాన్ని జారవిడుచుకున్నారని మండిపడ్డారు. ఈ చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్ ప్రభుత్వం తమ వంతు కృషి చేసిందని, ఇరు దేశాల మధ్య విభేదాలను తొలగించడానికి వారు పడ్డ శ్రమ అభినందనీయమని వాన్స్ పేర్కొన్నారు.

ఒప్పందం కుదరకపోవడంతో ఇప్పుడు పశ్చిమ ఆసియాలో మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. అమెరికా తన తుది ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచిందని, దాన్ని అంగీకరిస్తారా లేదా అనేది ఇక ఇరాన్ ఇష్టమని వాన్స్ కుండబద్దలు కొట్టారు. అణు నిరోధక ఒప్పందం కుదరని పక్షంలో ఇరాన్ పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి, ఎందుకంటే ఈ విఫల చర్చలు మళ్ళీ యుద్ధ మేఘాలకు దారితీస్తాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com