తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- April 13, 2026
హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు వైద్య పరీక్షల నిమిత్తం గంటల తరబడి నిరీక్షించే అవస్థలను తప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెల్త్ ఏటీఎంలను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యంత్రాల ద్వారా అత్యంత వేగంగా, నాణ్యమైన వైద్య సేవలను రోగుల చెంతకే చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌లోని కింగ్ కోఠి, మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. అక్కడ ఈ యంత్రాల పనితీరుపై అధికారులు జరిపిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. హెల్త్ ఏటీఎంలు అందించిన రిపోర్టులను టీ-డయాగ్నోస్టిక్స్, ప్రముఖ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్టులతో పోల్చి చూడగా, ఫలితాల్లో పూర్తి కచ్చితత్వం ఉన్నట్లు తేలింది. ఈ సదుపాయాన్ని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించాలని నిర్ణయించింది.
దాదాపు 130 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఇందులో బీపీ, ఈసీజీ, శరీరంలో కొవ్వు శాతం, ఆక్సిజన్ లెవల్స్, శరీర ఉష్ణోగ్రత వంటి 65 రకాల ప్రాథమిక పరీక్షలు కేవలం నిమిషాల్లోనే పూర్తవుతాయి. వీటితో పాటు గ్లూకోజ్, హిమోగ్లోబిన్, లిపిడ్ ప్రొఫైల్, కాలేయం (Liver), కిడ్నీ పనితీరు, థైరాయిడ్ వంటి కీలక రక్త పరీక్షలను కూడా ఇక్కడ నిర్వహిస్తారు. గర్భిణుల కోసం ‘ఫీటల్ డాప్లర్’, చర్మ వ్యాధుల కోసం ‘డెర్మాస్కోప్’ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ హెల్త్ ఏటీఎం వ్యవస్థను అత్యంత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం దీనిని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) తో అనుసంధానించింది. దీనివల్ల రోగుల పరీక్షా ఫలితాలు డిజిటల్ రూపంలో వారి అభా కార్డులో భద్రంగా ఉంటాయి. పరీక్ష పూర్తయిన వెంటనే రిపోర్టులు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా రోగి మొబైల్ ఫోన్‌కు అందుతాయి.
పైలట్ ప్రాజెక్టులో ఒక వ్యక్తికి అన్ని రకాల పరీక్షలు చేయడానికి సుమారు 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రద్దీని తగ్గించేందుకు, పెద్ద ఆసుపత్రుల్లో రెండు లేదా మూడు యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పేద ప్రజలకు వేల రూపాయల భారం తగ్గించే ఈ హెల్త్ ఏటీఎంలు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







