అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు

- April 16, 2026 , by Maagulf
అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా మరియు ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ పూర్తి స్థాయి యుద్ధ విరమణపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

మొదటి దఫా చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఆ సమావేశంలో స్పష్టమైన ఒప్పందం కుదరకపోవడంతో చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. అయితే ఇరు దేశాలు మరోసారి చర్చలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రకారం ఈ వారం రోజుల్లోనే రెండో దఫా చర్చలు జరగే అవకాశం ఉంది. అయితే ఆ సమావేశం ఎక్కడ జరుగుతుందన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

ఈ విషయంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. రెండో దఫా చర్చల గురించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని వెల్లడించింది. తేదీ లేదా వేదిక ఇంకా ఖరారు కాలేదని తెలిపింది.

అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇరు దేశాల మధ్య సమాచార వారధిగా పనిచేస్తూ చర్చలు జరిగేందుకు సహకరిస్తోంది. అందువల్లే తొలి దఫా చర్చలు పాకిస్థాన్‌లో నిర్వహించబడ్డాయి.

ప్రధాన వివాదాస్పద అంశాలు
రెండో దఫా చర్చలు జరగడానికి ముందు కొన్ని కీలక అంశాలపై స్పష్టత అవసరం ఉంది.

వాటిలో ముఖ్యంగా:

  • ఇరాన్ అణు కార్యక్రమం
  • హార్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెరవడం
  • ఇరాన్‌ పై అమెరికా ఆర్థిక ఆంక్షలు

ఈ అంశాలపై ఏకాభిప్రాయం కుదిరితేనే చర్చలు ముందుకు సాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com