హర్మూజ్ జలసంధి అంశంపై అమెరికా మరియు ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ ప్రాంతంలో నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రకటనకు స్పందించిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
దిగ్బంధనం కొనసాగితే హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేయాల్సి వస్తుందని ఘలీబాఫ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ, ఇరాన్ అనుమతి ఉన్న నౌకలకే ఈ మార్గంలో ప్రయాణం సాధ్యమవుతుందని చెప్పారు. అబద్ధపు ప్రచారాలతో యుద్ధం గెలవలేరని, నిజమైన పరిస్థితులను క్షేత్రస్థాయే నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలోని దాదాపు ఐదో వంతు చమురు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. గత రెండు నెలలుగా ఈ మార్గం మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. తాజాగా ఇరాన్ వాణిజ్య నౌకల కోసం మార్గాన్ని తెరిచినప్పటికీ, పూర్తి భద్రతా హామీలు వచ్చే వరకు అనేక నౌకా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.