విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- April 25, 2026
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఏప్రిల్ 25, శనివారం నాడు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ – స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క ‘విక్రమ్-1’ ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను జెండా ఊపి ప్రారంభించారు. దీనికోసం మ్యాక్స్-క్యూ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ ప్రపంచ అగ్రగామిగా ఎదిగే ప్రయాణంలో ఇదొక కీలక మైలురాయి అన్నారు సీఎం రేవంత్. ఈ రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి (SDSC) లాంచ్ సైట్‌కు అధికారికంగా బయలుదేరింది. రాబోయే కొద్ది నెలల్లోనే స్కైరూట్ సంస్థ భారతదేశపు మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ ప్రయత్నాన్ని చేపట్టనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కైరూట్ బృందాన్ని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రాకెట్ పూర్తిగా హైదరాబాద్‌లోనే డిజైన్, అభివృద్ధి చేయబడటం మాకెంతో గర్వకారణం. 2022లో తన మొదటి రాకెట్‌ను ప్రయోగించిన స్కైరూట్, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిటల్ లాంచ్ దశకు చేరుకోవడం విశేషం. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. బోయింగ్, ఎయిర్‌బస్, సఫ్రాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు ఇప్పటికే రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకున్నాయి అన్నారు.
2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా మార్చడమే లక్ష్యమని సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023-24 మరియు 2024-25 మధ్య ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 117.9 శాతం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఇందులో విమాన భాగాలు, రక్షణ పరికరాల వాటా అత్యధికంగా ఉందన్నారు.
నైపుణ్యాభివృద్ధి పై దృష్టి:
ఏరోస్పేస్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయడానికి గ్లోబల్ యూనివర్సిటీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు సీఎం తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU), అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATC), మరియు పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.
స్కైరూట్ స్పందన:
స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ మరియు కో-ఫౌండర్ పవన్ కుమార్ చందన, స్కిల్స్ యూనివర్సిటీ ఆలోచనపై హర్షం వ్యక్తం చేస్తూ, YISUతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపారు. “నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత మాకు పెద్ద సవాలు, YISUతో భాగస్వామ్యం మాకు ఎంతో మేలు చేస్తుంది” అని ఆయన అన్నారు.
మల్లెపల్లిలోని ఏటీసీలను సందర్శించాలని స్కైరూట్ నాయకత్వాన్ని సీఎం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, స్కైరూట్ కో-ఫౌండర్ భరత్ దాక మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









