మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- May 01, 2026
కౌలాలంపూర్: మలేషియా ప్రభుత్వం అక్రమంగా నివసిస్తున్న విదేశీ కార్మికులకు మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారుల కోసం అమలు చేస్తున్న మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్ (PRM) 2.0 క్షమాభిక్ష పథకాన్ని అధికారికంగా 2027 మే 31 వరకు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఓవర్‌స్టే లేదా డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తున్న వేలాది మంది వలసదారులకు చట్టబద్ధంగా సమస్యలు పరిష్కరించుకుని స్వదేశాలకు వెళ్లేందుకు అదనపు సమయం లభించింది.
మలేషియా ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్ జనరల్ దాతో జకారియా షాబాన్ కౌలాలంపూర్‌లో విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. మొదట ఈ పథకం 2026 ఏప్రిల్ 30తో ముగియాల్సి ఉండగా, భారీ స్పందనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దీన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
2.54 లక్షల మందికి పైగా నమోదు
2025 మే 19 నుంచి 2026 ఏప్రిల్ 29 వరకు అమలైన PRM 2.0 కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అధికారిక గణాంకాల ప్రకారం:
- 112 దేశాలకు చెందిన 2.54 లక్షలకు పైగా వలసదారులు నమోదు చేసుకున్నారు.
- జరిమానాల రూపంలో మలేషియా ప్రభుత్వానికి RM 127 మిలియన్ (సుమారు రూ.300 కోట్లు) ఆదాయం వచ్చింది.
ఈ పథకం ద్వారా అక్రమంగా ఉన్న విదేశీ కార్మికులు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా స్వదేశాలకు తిరిగి వెళ్లే అవకాశం పొందుతున్నారు.
అక్రమ వలసదారులు, యజమానులపై కఠిన చర్యలు కొనసాగింపు
PRM 2.0 గడువు పొడిగించినప్పటికీ, అక్రమ వలసదారులు మరియు వారిని ఉద్యోగాల్లో ఉంచుకునే యజమానులపై కఠిన చర్యలు కొనసాగుతాయని మలేషియా ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలుగు కార్మికులకు FNCA-మలేషియా విజ్ఞప్తి
ఫెడరేషన్ ఆఫ్ NRI కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA-మలేషియా) ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన తెలుగు కార్మికులను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.
సంస్థ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం:
- ఈ పథకం కింద స్వదేశానికి వెళ్లేందుకు కేవలం 500 మలేషియా రింగ్గిట్ మాత్రమే చెల్లించాలి.
- పాస్‌పోర్టు ఉన్నవారు వారం రోజుల్లో విమాన టికెట్ సిద్ధం చేసుకోవాలి.
- పాస్‌పోర్టు లేని వారు భారత హైకమిషన్ ద్వారా ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికేట్ పొందాలి. ఏజెంట్ల మోసాలకు గురైన తెలుగు కార్మికులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అనేక మంది భారతీయ కార్మికులు మలేషియాలో పామ్ ఆయిల్ తోటలు, రబ్బర్ తోటలు, నిర్మాణ రంగం, హోటళ్లలో పనిచేస్తున్నారు. మంచి జీతాలు, ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు విజిట్ వీసాలపై తీసుకువచ్చి, వర్క్ పర్మిట్లు ఇవ్వకుండా మోసం చేసిన ఘటనలు ఎక్కువగా ఉన్నాయని FNCA తెలిపింది.
FNCA-మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ క్షమాభిక్ష పథకం ద్వారా అక్రమంగా ఉన్న భారతీయులు గౌరవప్రదంగా స్వదేశాలకు తిరిగి వెళ్లే అవకాశాన్ని వదులుకోకూడదన్నారు.
అప్లికేషన్ ప్రక్రియలో FNCA-మలేషియా తో పాటు తెలుగు ఎక్స్పెట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా, మలేషియా ఆంధ్రా అసోసియేషన్ వంటి తెలుగు సంఘాలు పూర్తి సహాయం అందిస్తున్నాయని తెలిపారు.
మలేషియాలో అక్రమంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ పొడిగించిన గడువులోగా నమోదు చేసుకుని స్వదేశాలకు వెళ్లాలని అధికారులు, తెలుగు సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







