నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్
- May 04, 2026
సైబరాబాద్: నార్సింగిలోని రాజపుష్ప లేబర్ క్యాంప్‌లో వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక 'వర్క్ సైట్ స్కూల్'ను సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మరియు సీఎంసీ కమిషనర్ సృజన కలిసి ప్రారంభించారు. తెలంగాణ విద్యాశాఖ, మున్సిపల్ శాఖ మరియు రాజపుష్ప ప్రాపర్టీస్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ రాష్ట్రాల నుండి బతుకుదెరువు కోసం వచ్చిన కార్మికుల పిల్లలకు రక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని కల్పించడమే ఈ పాఠశాల ప్రధాన ఉద్దేశ్యం. ఈ విద్యా కేంద్రం ద్వారా చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భవిష్యత్తు లభించనుంది.
*ఈ సందర్భం గా సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ,,* తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వలస కార్మికుల శ్రమ ఎంతో ఉందని, వారికి రక్షణ కల్పించి భరోసానివ్వాల్సిన బాధ్యత మనపై ఉందని డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. సర్వ శిక్ష అభియాన్ మరియు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా మధ్యాహ్న భోజనం అందించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ శాఖలైన జిహెచ్ఎంసి, రెవెన్యూ, లేబర్ డిపార్ట్మెంట్‌లతో పాటు ప్రైవేట్ సంస్థలు, ఎన్జీవోలు మరియు డెవలపర్లు సమిష్టిగా పనిచేస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. చిన్నారులు ఈ దేశానికి ఆస్తి అని, వారిలో మంచి విలువలు నింపి, గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ దిశగా ముందుకొచ్చిన రాజపుష్ప ప్రాపర్టీస్ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
లేబర్ క్యాంపుల్లో సరైన రక్షణ, మార్గదర్శనం లేని చిన్నారులు పెడదోవ పట్టే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిసలైన వారి వల్ల ఈ పిల్లలపై అఘాయిత్యాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అంగన్వాడీ తరహా కేంద్రాల ద్వారా పిల్లలకు క్రమశిక్షణ, మంచి ప్రవర్తన నేర్పించి, వారిని నేరాల బారిన పడకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం సైబరాబాద్ లో 100 కు పైగా లేబర్ క్యాంపుల్లో ఉన్న వేలాదిమంది చిన్నారులకు చదువు చెప్పించే బాధ్యతను ప్రతి ఒక్కరూ పంచుకోవాలని కోరారు. ముఖ్యంగా పిల్లలకు వారి మాతృభాషలోనే విద్యాబోధన చేయడం ద్వారా వారు త్వరగా నేర్చుకుంటారని సూచించారు. తక్కువ సమయం లో ఇంత చక్కటి ఆలోచన కు కార్యరూపం కల్పించిన నార్సింగి స్టేషన్ హౌస్ అధికారి హరికృష్ణా రెడ్డి కి సీపీ అభినందనలు తెలిపారు.
*సీఎంసీ కమిషనర్ సృజన మాట్లాడుతూ,,* హైదరాబాద్ నగరాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపే క్రమంలో కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ను కూడా ఒక బాధ్యతగా తీసుకుంటామని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. బతుకుతెరువు కోసం వలస వచ్చిన కార్మికుల పిల్లలకు కనీస హక్కులు, సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన చేసిన సైబరాబాద్ సీపీ ని ఆమె అభినందించారు. ఈ పిల్లలకు విలాసవంతమైన జీవితం ఇవ్వలేకపోయినా, ఒక మంచి వాతావరణాన్ని, భద్రతను కల్పించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ వర్క్ సైట్ స్కూల్ కార్యక్రమం ఒక రోజుకు పరిమితం కాకుండా, ఒక శాశ్వత వ్యవస్థలా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఇందుకోసం సీఎంసీ తరపున కేర్ టేకర్లను ఏర్పాటు చేయడంతో పాటు, పిల్లల వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. వలస కార్మికుల పిల్లలు సురక్షితమైన ప్రదేశంలో పెరుగుతూ, సమాజంపై నమ్మకంతో గొప్ప పౌరులుగా ఎదగాలని, ఈ దిశగా పోలీస్ శాఖతో కలిసి సైబరాబాద్ మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని కమిషనర్ సృజన స్పష్టం చేశారు.
*రాజపుష్ప ఫౌండేషన్ శ్రీమతి పుష్పలీల మాట్లాడుతూ,,* ప్రస్తుతం ఈ క్యాంప్ లో జార్ఖండ్, ఒడిశా, యూపీ, అస్సాం వంటి రాష్ట్రాల నుండి వచ్చిన 58 మంది పిల్లల కోసం ప్రత్యేక విద్యా వసతులు కల్పించామన్నారు. వీరి కోసం విద్యాశాఖ నుండి ఒకరు, రాజపుష్ప ప్రాపర్టీస్ తరపున ఒక మహిళా టీచర్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశంలోనే ఈ తరహాలో ఒక పూర్తిస్థాయి పాఠశాలను వర్క్ సైట్ వద్ద ప్రారంభించడం ఇదే మొదటిసారి కావచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ఇటువంటి పాఠశాలలను రాజపుష్ప ఫౌండేషన్ తరపున శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసి, కార్మికుల బిడ్డలకు విద్యా ప్రోత్సాహాన్ని అందిస్తామని ఆమె స్పష్టం చేశారు.
*రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి సుశీంద్ర రావు మాట్లాడుతూ,,* వలస కార్మికుల బిడ్డలందరికీ విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద లేబర్ క్యాంపుల్లోని పిల్లలకు పాఠశాల వసతి కల్పించి, వారు చదువుకునేలా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి బిడ్డకు విద్యా హక్కు కల్పించే దిశగా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. మధ్యహ్న భోజన వసతి కూడా అక్షయ పాత్ర ద్వారా అందచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్. శ్రీనివాస్, కూకట్‌పల్లి ఏడీసీపీ సుదర్శన్, రాజ పుష్ప ఎండి మహేందర్ రెడ్డి, నార్సింగి ఎస్‌హెచ్‌ఓ హరికృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- సీబ్ విలాయత్‌లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా









