కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- May 04, 2026
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి, ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవిత పాలమూరు గడ్డ మీది నుంచే రాజకీయంగా మొదటి అడుగు వేయనున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగుతానని ప్రకటించిన కల్వకుంట్ల కవిత అన్నట్టుగానే ఈనెల 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కృష్ణా జలాల సాధనకు శంఖారావం పూరించనున్నారు. 8న ఉదయం జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకోనున్న కవిత అదే రోజు సాయంత్రం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తన మొదటి ప్రాధాన్యతగా కృష్ణా జలాల సాధనకు శ్రీకారం చుట్టారు. ఈనెల 8న చౌదరిగూడెం వద్ద ‘‘పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ’’ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వెనుకబడి ఉండటానికి పాలకుల లోపభూయిష్ట విధానాలే కారణమని పలు వేదికలపై నుంచి కవిత స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకుంటూ మన బీళ్లకు మళ్లించుకునేందుకు తమ వద్ద స్పష్టమైన విధానాలు ఉన్నాయని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే కృష్ణా నీళ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట శంకుస్థాపన చేసిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు 11 ఏళ్లు గడిచిన తర్వాత కూడా 50 పనులు పూర్తి చేయకపోవడంపై ‘‘జనంబాట’’ కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి ప్రాజెక్టుకు సత్వర అనుమతులు సాధించడంతో పాటు పనులు వేగంగా పూర్తి చేయించడానికి ఉద్యమ ప్రణాళిక ప్రకటించే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. తెలంగాణకు హక్కుగా దక్కే ప్రతి చుక్క నీటిని మన బీడు భూములకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
‘‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ’’ పోస్టర్ ఆవిష్కరణ
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇచ్చే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సహా మూడు ప్యాకేజీల పనులను 11 ఏళ్ల తర్వాత కూడా ప్రారంభించకపోవడం పై ఉద్యమానికి కవిత శ్రీకారం చుట్టారు.ఈ నెల 8న కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరి గూడెం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నవీన్ ఆచారి, గొంగళ్ల రంజిత్ కుమార్, సయ్యద్ ఇస్మాయిల్, నరేశ్ ప్రజాపతి, ఎదురుగట్ల సంపత్ గౌడ్, సీమ రమేశ్, బుచ్చిబాబు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా









