అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్

- May 05, 2026 , by Maagulf
అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్

అనంతపురం, మే 5: పిలిప్పీన్స్ కేంద్రంగా నడుస్తున్న అంతర్జాతీయ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను కళ్యాణదుర్గం పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ముఠాకు చెందిన 10 మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు. మొత్తం స్వాధీనం విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎల్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించగా, కళ్యాణదుర్గం డీఎస్పీ పి. రవిబాబు పర్యవేక్షణలో పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని సిద్దప్పవంక వీధిలో ఓ ఇంటిలో నిందితులు ‘డ్రీమ్ ప్లే-1’ యాప్ ద్వారా క్యాసినో, రోలెంట్, డ్రాగన్, క్రికెట్ బెట్టింగ్ వంటి నిషేధిత గేమ్స్ నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పిలిప్పీన్స్ కేంద్రంగా నెట్‌వర్క్:
పోలీసుల విచారణలో… శివ అనే వ్యక్తి పిలిప్పీన్స్‌లోని మాకాటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా సభ్యులను నియమించి, వారి ద్వారా బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు సేకరించి విదేశాలకు పంపుతున్నట్లు గుర్తించారు. ఫోన్‌పే ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ అక్రమ ఆదాయం పొందుతున్నట్లు వెల్లడైంది.

మ్యూల్ ఖాతాల వినియోగం:
స్థానికంగా తలారి మధు ముఠాను నడిపిస్తూ, ఇతరులను చేర్చుకుని సుమారు 70 మంది పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు తెలిసింది. పాస్‌బుక్స్ కోసం వారికి రూ.10 వేల చొప్పున చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. సేకరించిన సిమ్ కార్డులు, బ్యాంకు వివరాలను కార్గో పార్శిళ్లలో దాచిపెట్టి పిలిప్పీన్స్‌కు పంపినట్లు వెల్లడించారు.

కఠిన చర్యలు తప్పవు:
బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఆన్లైన్‌లో జరిగినా గుర్తించలేరని భావించడం పొరపాటు అని, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిరంతర నిఘా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com