ప్రజల మ‌న‌సులు గెల‌వండి..మ‌ళ్లీ, మ‌ళ్లీ మ‌న‌ల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్

- May 05, 2026 , by Maagulf
ప్రజల మ‌న‌సులు గెల‌వండి..మ‌ళ్లీ, మ‌ళ్లీ మ‌న‌ల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్

అమరావతి: మ‌నం చేసిన అభివృద్ధి-సంక్షేమం ప్ర‌జ‌ల‌కు వివ‌రించండి.. అహంకారం వీడి స‌త్ప్ర‌వ‌ర్త‌న‌, మంచి మాట‌ల‌తో ప్ర‌జ‌ల మ‌న‌స్సులు గెల‌వండి. ప్ర‌జ‌లే మ‌న‌ల్ని మ‌ళ్లీ..మ‌ళ్లీ గెలిపిస్తార‌ని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కేడ‌ర్‌కు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసంలో టిడిపి క్ల‌స్ట‌ర్‌, యూనిట్ ఇన్చార్జుల‌తో నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ``తెలుగుదేశం పార్టీ లీడ‌ర్లు, కేడ‌ర్ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ అనునిత్యం ప్రజలతో మమేకం కావడం ముఖ్యం... గత ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 151 నుంచి 11సీట్లకు దిగజారడానికి వారి అహంకారమే కారణం. ఎట్టి ప‌రిస్థితుల్లో అహంకారం, ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌కుండా ప్ర‌జ‌ల‌తో గౌరవప్రదమైన భాషలో మాట్లాడి వారి మనసులు గెలవండి... `` అని సూచించారు. 

 అభివృద్ధి-సంక్షేమంలో మ‌న‌మే ఫ‌స్ట్‌ 

``ప్రస్తుతం దేశంలో రూ.4వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్రమే... తల్లికి వందనం పథకం కింద చదువుకునే పిల్లలందరికీ రూ.15వేల చొప్పున ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల పథకాలను అమలు చేస్తున్నాం. ఆటోడ్రైవర్ల సేవలో, మత్స్యకార భరోసా వంటి పథకాలను కూడా ఇస్తున్నాం. పోల‌వ‌రం పూర్తి కావ‌స్తోంది. అభివృద్ది జోరుగా సాగుతోంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. `` అని పేర్కొన్నారు. 

 సానుకూల దృక్పథమే గెలుపు సూత్రం

నెగిటివ్ ఆలోచనలు వద్దు, సానుకూల దృక్పథంతో పనిచేయడంలో మ‌న అధినేత చంద్రబాబు గారిని ప్రతిఒక్క కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నికల్లో ప్రతిఓటు కీలకమే... తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఒక్కఓటుతో గెలిచిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునికేడర్ పనిచేయాలి. పార్టీలో శిక్షణాతరగతులు నిరంతరం కొనసాగుతాయి. ఏడాదిలో 300రోజుల పాటు మండల, క్లస్టర్, యూనిట్ ఇన్ చార్జిలకు తరగతులు నిర్వహిస్తాం. తెలుగుదేశం పార్టీ ఆరు శాసనాల్లో కార్యకర్తే అధినేత ఒకటి. చంద్రబాబు వద్ద ఇప్పుడు కోటరీలు లేవు, సామాన్య కార్యకర్త సైతం నేరుగా అయనను కలసి సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది. ప్రతివారం చంద్ర‌బాబు గారైనా, తానైనా కేంద్ర కార్యాలయంలో కేడర్ కు అందుబాటులో ఉంటాం.మై టిడిపి యాప్ లో టాప్ -10 కేడర్ తో ప్రతి మూడునెలలకోసారి కలుస్తా.  రాజ‌కీయ పార్టీల చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా మండల పార్టీ అధ్యక్షురాలు, క్లస్టర్ ఇన్ చార్జిలకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించాం.  ప్రతి నాయకుడి పనితీరును అధినేత చంద్రబాబు గారు ప్రతి మూడునెలల కోసారి సమీక్షిస్తారు, పనిచేయకపోతే పదవులు పోతాయని నిర్మొహమాటంగా మాతో చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అంద‌రూ పనిచేయాలి.

తెలుగుదేశంలో వ్యక్తులు కాదు...పార్టీ శాశ్వతం

తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదు... పార్టీ శాశ్వతం. పార్టీలో ఈరోజు నాకు ఎవరితో విభేదాలు లేవు. సమస్య ఉన్నవారిని పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడి పరిష్కరిస్తున్నా. ఏవైనా సమస్యలుంటే అంతర్గత వేదికలపై మాట్లాడి పరిష్కరించుకోవాలి. ప్రజల్లో పార్టీ ఇమేజ్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సుమారు 50 నియోజకవర్గాల్లో పర్యటించి, కార్యకర్తలను కలుసుకున్నా. 2027లోగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్టీ కేడర్ పై పెట్టిన 80 శాతం అక్రమ కేసులు ఇప్పటికే తొలగించాం, మిగిలినవి కూడా తీసేస్తాం. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం. వివిధ కారణాలతో నాయకత్వం పై అలిగి ఇంట్లో పడుకోవడం వల్ల అంతిమంగా పార్టీ నష్టపోతుంది. 


 ప‌నిచేసేవారికి స‌ముచిత స్థానం

``చంద్ర‌బాబు, నేను ప‌ర్య‌ట‌న‌ల‌కు మా సొంత వాహ‌నాలు వినియోగిస్తున్నాం. వ్య‌క్తిగ‌త విదేశీప‌ర్య‌ట‌న‌లు మా సొమ్ముతోనే వెళుతున్నాం. మేం జ‌వాబుదారీగా ఉంటున్నాం. కానీ ప్ర‌త్య‌ర్థులు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. వారి ఫేక్ ప్ర‌చారాన్ని మ‌నం వాస్త‌వ స‌మాచారంతో వెంట‌నే తిప్పికొట్టాలి.  సోష‌ల్మీడియాలో ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌నంత‌గా ఫేక్ ప్ర‌చారం జ‌రుగుతున్న ఈ స‌మ‌యంలో ప్రతి కార్యకర్త అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినపుడు గౌరవంగా వ్యవహరించాలని ఆదేశాలిస్తాం. దీర్ఘకాలంగా అధికారంలో కొనసాగేందుకు బిజెపి అమలుచేస్తున్న విధానాలను అధ్యయనం చేస్తున్నాం. మన పార్టీలో మై టిడిపి యాప్ మాదిరిగానే బిజెపిలో సరళ్ యాప్ ఉంది. కేంద్రమంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు వారు చేసే రోజువారీ పనిని అందులో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ప‌నిచేసే ప్ర‌తీ ఒక్క‌రినీ గుర్తించి స‌ముచిత స్థానం క‌ల్పిస్తాం`` అని లోకేష్ భ‌రోసా ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com