2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- May 07, 2026
యూఏఈః 2025లో యూఏఈ వ్యాప్తంగా మొత్తం 5,58,191 కొత్త డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరం జారీ చేసిన 5,04,377 లైసెన్సులతో పోలిస్తే ఇది 10.7 శాతం ఎక్కువని పేర్కొంది.ఈ వృద్ధి యూఏఈలో జనాభా పెరుగుదలతోపాటు ప్రవాసులు, వృత్తి నిపుణులకు ఒక ప్రపంచ కేంద్రంగా మారిందన్న దానికి నిదర్శనం అని తెలిపింది.
ఇక కొత్తగా జారీ చేసిన లైసెన్సులలో 4,43,988 మంది పురుషులు ఉన్నారు. 2024లో జారీ చేసిన 3,96,371 లైసెన్సులతో పోలిస్తే 12 శాతం పెరుగుదల నమోదైంది. 1,14,203 మంది మహిళలు తమ డ్రైవింగ్ లైసెన్సులను పొందారు. ఇది అంతకు ముందు సంవత్సరం మహిళలకు జారీ చేసిన 1,08,006 లైసెన్సులతో పోలిస్తే 5.7 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
రహదారులు, రైల్వేలు మరియు మెట్రో మార్గాలు
ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో కొత్త డ్రైవర్లు రహదారులపైకి వస్తుండటంతో ఈ వృద్ధి వేగానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు యూఏఈ పేర్కొంది. ఫెడరల్ స్థాయిలో, ప్రభుత్వం నాలుగవ ఫెడరల్ కారిడార్‌ను నిర్మిస్తోంది. ఇది 6 బిలియన్ దిర్హమ్‌ల వ్యయంతో 120 కిలోమీటర్ల పొడవున, 12 లేన్‌లతో నిర్మిస్తున్నారు. ఇది అబుదాబి, దుబాయ్ మరియు షార్జాలతో సహా ఐదు ఎమిరేట్‌లను కలుపుతుంది. ఇది ఫెడరల్ రహదారుల సామర్థ్యాన్ని 73 శాతం పెంచుతుందని భావిస్తున్నారు.
దుబాయ్‌లో రోడ్లు మరియు రవాణా అథారిటీ (రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ) 2027 చివరి నాటికి 72 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది. వీటిలో 226 కిలోమీటర్ల కొత్త రహదారులతో పాటు 115 బ్రిడ్జిలు మరియు టన్నెల్స్ ఉన్నాయి.
అలాగే, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రజా రవాణా విస్తరణ ప్రాజెక్టు అయిన 20.5 బిలియన్ దిర్హమ్‌ల మెట్రో బ్లూ లైన్‌ను కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది. 14 స్టేషన్లతో కూడిన ఈ 30 కిలోమీటర్ల మార్గం..దుబాయ్ మెట్రో ప్రారంభమై సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా.. సెప్టెంబర్ 9, 2029న ప్రారంభం కానుంది. 9 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడిన మరో మెట్రో గోల్డ్ లైన్‌ను కూడా 2032 కోసం ప్రకటించారు. ఈ ప్రాజెక్టులన్నీ కలిసి అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించుకోవడానికి యూఏఈ కృత నిశ్చయంతో ఉందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







