డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- May 08, 2026
హైదరాబాద్: భావి భారత పౌరులైన యువతను మత్తు రక్కసి కోరల నుంచి కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. నగర ప్రొడక్టివిటీకి చిరునామాగా, వేలాది మంది విద్యార్థుల విద్యా కేంద్రంగా ఉన్న దిల్సుక్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు *మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి* వెల్లడించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
డ్రోన్ పోలీసింగ్..టెక్నాలజీతో చెక్!
నేరగాళ్ల కంటే ఒక అడుగు ముందే ఉండాలన్న సంకల్పంతో అత్యాధునిక సాంకేతికతను పోలీసులు రంగంలోకి దించారు.
డ్రోన్" ఆకాశం నుంచి నిఘా:
అర్ధరాత్రి వేళల్లో విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిశితంగా పర్యవేక్షించనున్నారు.
స్పాట్ టెస్టులు:
రాత్రిపూట పెట్రోలింగ్ చేసే పోలీసులకు ప్రత్యేక *'డ్రగ్ డిటెక్షన్ కిట్లు'* అందజేశారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులకు తక్షణమే పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటారు.
సిసి కెమెరాల కవచం:
ఈ ప్రాంతంలోని 3,200 కెమెరాలలో 70% పైగా క్రియాశీలంగా ఉన్నాయని, వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించినట్లు సీపీ తెలిపారు.
హాస్టళ్ల పై ప్రత్యేక ఆడిట్..నిర్వాహకులకు హెచ్చరిక
సరూర్ నగర్ పరిధిలోని హాస్టళ్లలో ఇప్పటికే ప్రత్యేక ఆడిట్ నిర్వహించినట్లు సీపీ సుమతి పేర్కొన్నారు. "హాస్టల్ నిర్వాహకులు తప్పనిసరిగా హై-రిజల్యూషన్ సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే హాస్టళ్లను సీజ్ చేయడానికి వెనుకాడం."
పాన్ డబ్బాలే టార్గెట్
మత్తు పదార్థాల విక్రయాలకు కేంద్రాలుగా మారుతున్న పాన్ డబ్బాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. నిషేధిత పదార్థాలు విక్రయిస్తే కఠినమైన పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగర భద్రతలో సామాన్య పౌరులు, పెడెస్ట్రియన్లు సైతం భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
"ఒక్క కేసు.. జీవితాంతం చీకటి"
యువతకు హితబోధ చేస్తూ సీపీ సుమతి భావోద్వేగంగా మాట్లాడారు.
"తెలంగాణ దేశంలోనే అత్యంత యువ రాష్ట్రం. 15 నుండి 30 ఏళ్ల వయసు అనేది దేశానికి పునాది వంటిది. ఈ సమయంలో కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలే తప్ప, క్షణికానందం కోసం మత్తుకు బానిస కావొద్దు. ఒక్కసారి NDPS (మత్తు పదార్థాల నిరోధక చట్టం) కేసులో చిక్కుకుంటే, మీ కెరీర్ అక్కడితో ముగిసిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలకు శాశ్వతంగా దూరమవుతారు."
పాత అనుభవాల నేపథ్యంలో పక్కా ప్లాన్
గతంలో తాను సికింద్రాబాద్ డీసీపీగా ఉన్నప్పుడు ఎదురైన సవాళ్లను ఆమె గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని అక్రమ లాడ్జీలు డ్రగ్స్ విక్రయాలకు ఎలా అడ్డాగా మారాయో వివరించిన ఆమె, ప్రస్తుత బాధ్యతల్లో అటువంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన గ్రౌండ్ లెవల్ నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. బాధితులకు శిక్షలతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని జనజీవన స్రవంతిలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.

తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









