ఐపీఎల్ ఆటగాళ్లకు BCCI హెచ్చరిక

- May 08, 2026 , by Maagulf
ఐపీఎల్ ఆటగాళ్లకు BCCI హెచ్చరిక

ఐపీఎల్ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, ఆటగాళ్ల హోటల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. టీమ్ మేనేజర్ ముందస్తు అనుమతి లేకుండా బయటి వ్యక్తులు (స్నేహితులు లేదా బంధువులైనా సరే) ఆటగాళ్ల గదుల్లోకి ప్రవేశించడంపై నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, సదరు ఆటగాడిని లేదా ఫ్రాంఛైజీ అధికారిని తక్షణమే సస్పెండ్ చేసే అధికారం బోర్డుకు ఉంటుందని హెచ్చరించింది. ఆటగాళ్లు ఎక్కడికి వెళ్లినా సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇవ్వడం తప్పనిసరి చేశారు.

హనీ ట్రాప్ ముప్పు..అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

ఈ హెచ్చరికల్లో అత్యంత కీలకమైన అంశం ‘హనీ ట్రాప్’ (Honey-Trap). ఐపీఎల్ వంటి హై-ప్రొఫైల్ లీగ్‌లో ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు తప్పుడు మార్గాల్లో ప్రలోభపెట్టే అవకాశం ఉందని యాంటీ కరప్షన్ యూనిట్ (ACSU) హెచ్చరించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు లేదా అపరిచిత వ్యక్తులు టీమ్ బస్సుల్లోకి ఎక్కడం, హోటల్ గదుల్లోకి రావడం వంటివి గతంలో వెలుగులోకి రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిణామాలు లైంగిక వేధింపుల వంటి చట్టపరమైన చిక్కులకు కూడా దారితీసే ప్రమాదం ఉందని, ఫ్రాంఛైజీ యాజమాన్యాలు తమ ప్లేయర్లపై నిరంతరం నిఘా ఉంచాలని బోర్డు ఆదేశించింది.

నిషేధిత పదార్థాలపై కఠిన వైఖరి

డ్రెస్సింగ్ రూమ్‌లు మరియు స్టేడియం పరిసరాల్లో ఈ-సిగరెట్లు, వేప్స్ (Vapes) వాడటాన్ని బీసీసీఐ పూర్తిగా నిషేధించింది. ఇది కేవలం లీగ్ నిబంధనల ఉల్లంఘనే కాకుండా, భారత చట్టాల ప్రకారం నేరం అని గుర్తు చేసింది. ఒకవేళ ఎవరైనా నిషేధిత పదార్థాలను వాడుతూ దొరికితే, క్రికెట్ నిబంధనలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసులకు రిపోర్ట్ చేస్తామని బోర్డు పేర్కొంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫ్రాంఛైజీ యజమానులు డగౌట్‌లోని ఆటగాళ్లతో మాట్లాడకూడదని కూడా కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చర్యలతో ఐపీఎల్ ప్రతిష్టను కాపాడాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com