సినిమా రివ్యూ: ‘గోదారి గట్టు పైన’!
- May 08, 2026
ఈ వేసవి ముఖ్యంగా ఈ నెల వాస్తవానికి పెద్ద సినిమాలతో సందడి చేయాల్సి వుంది. కానీ, అనుకోకుండా పెద్ద సినిమాలన్నీ జూన్‌కి వాయిదా పడడంతో చిన్న సినిమాలు క్యూ కట్టాయ్. అలాంటి ఓ చిన్న సినిమాకి ఈ నెలలో కరెక్ట్ ప్లేస్ దక్కింది. అదే ‘గోదారి గట్టు పైన’. సుమంత్ ప్రబాస్, నిధి ప్రదీప్ జంటగా తెరకెక్కిన చిత్రమిది.
సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు చిత్ర యూనిట్. మండే ఎండల్లో ఉల్లాసభరితమైన కూల్ మూవీ అని ప్రమోషన్స్ షురూ చేశారు. మరి, ఆ అంచనాల్ని సినిమా అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
రాజు (సుమంత్ ప్రబాస్) ఓ పల్లెటూరి కుర్రాడు. ఇంటి పరిస్థితుల వల్ల పదో తరగతిలోనే చదువు ఆపేసి ఆటో నడుపుతూ తల్లి, తండ్రి, చెల్లెలు, స్నేహితులే తన ప్రపంచంగా జాలీగా ఊళ్లో బతికేస్తుంటాడు. అలాంటి ఈ కుర్రాడి జీవితంలోకి మాయలా వస్తుంది మాయ(నిధి ప్రదీప్). తన చెల్లెలితో పాటూ ఇంజనీరింగ్ చదివుతుంటుంది. తొలి చూపులోనే మాయతో ప్రేమలో పడతాడు రాజు. కానీ, మాయ తండ్రి తాను ప్రాణంగా ప్రేమించే కూతురిని తన కన్నా బాగా వున్న కుర్రాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంతకీ మాయ తండ్రి శ్యాంబాబు (జగపతిబాబు) ఏం చేస్తుంటాడు.? తన కన్నా బాగా వున్న కుటుంబంలోకి మాయని ఎందుకు పంపించాలనుకుంటాడు.? రాజును ప్రేమిస్తున్న మాయ, తండ్రి మాటను జవదాటిందా.? ఆటో డ్రైవర్ అయిన రాజుతో పెళ్లికి శ్యాంబాబు ఒప్పుకుంటాడా.? ఈ విషయాలన్నీ తెలియాలంటే ‘గోదారి గట్టుపైన’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీ నటుల పనితీరు:
సుమంత్ ప్రబాస్ పల్లెటూరి కుర్రాడిలా ఆటో డ్రైవర్ పాత్లో చాలా హుషారుగా నటించిా మెప్పించాడు. చాలా ఈజ్‌తో కనిపించాడు. ఆటో డ్రైవింగ్‌లోనూ డాన్సుల్లోనూ తనదైన స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే, అవకాశం చిక్కినప్పుడల్లా హాస్యం కూడా బాగా పండించాడు. హీరోయిన్ నిధికీ మంచి స్కోపున్న పాత్రే దక్కింది. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర ఓ సర్ప్రైజింగ్. సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసే ఓ తండ్రి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురును బాగా సెటిలైన ఓ ఉన్నత కుటుంబానికి చెందిన కుర్రాడికిచ్చి పెళ్లి చేయాలనుకునే పాత్ర అది. చాలా కాలం తర్వాత ఈ తరహా పాత్రలో కనిపించారు జగపతిబాబు. హీరో, అతని స్నేహితుల గ్యాంగ్ జగపతిబాబుపై వేసిన కామెడీ పంచ్‌లు బాగా పేలతాయ్. మరో సర్ప్రైజింగ్ రోల్ ఈ సినిమాలో సీనియర్ నటి లైలా. జగపతి బాబు భార్యగా, హీరోయిన్‌కి తల్లి పాత్రలో కనిపించింది. కానీ, ఈ పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అప్పుడప్పుడూ భయపడడం, అప్పుడప్పూ సీరియస్ లుక్స్‌తో చూడడం తప్ప. సుదర్శన్ కామెడీ బాగా నవ్విస్తుంది. రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు సుభాష్ చంద్ర ఎంచుకున్న సబ్జెక్ట్ ఏమంత కొత్తదేం కాదు కానీ, ప్రేమకి కులమతాలు, ఆస్థి అంతస్థులు అడ్డు కావు.. అనే మెసేజ్ పాస్ చేయాలనుకున్నాడు. ఈ తరహాలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కథనం ఇంకాస్త కొత్తగా నడిపించాల్సి వుంది. ఇంటర్వెల్ టైమ్‌కి జగపతిబాబు పాత్రకి సంబంధించి ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. అప్పటి వరకూ సాగతీతగా సాదా సీదాగా సాగిన సినిమాకి సెకండాఫ్ ఆసక్తి కలిగేలా టర్న్ అవుతుంది. కానీ, ఆ ఇంపాక్ట్ ఆ స్థాయిలో వుండదు. అక్కడక్కడా ట్విస్టులు బాగున్నాయ్. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు తేలిపోతాయ్. పాటలు బాగున్నాయ్. పల్లెటూరి నేపథ్యాన్ని చూపించిన విధానం సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా వుంటయ్. ఎడిటింగ్ మాత్రం చాలా చాలా విసుగు తెప్పిస్తుంది. ఫస్టాఫ్‌లో చాలా కత్తెర సన్నివేశాలుంటాయ్. ఒక్క ఎడిటింగ్ తప్ప మిగిలిన సాంకేతిక వర్గం ఈ సినిమాకి ఓకే అని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్:
పల్టెటూరి బ్యాక్ గ్రైండ్‌లో విజువల్స్, గోదారి యాస బాస, కామెడీ, అక్కడక్కడా కొన్ని ట్విస్టులు సెకండాఫ్‌లో.
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ సాగతీత సన్నివేశాలు, రొటీన్ స్టోరీ, ఆకట్టుకోని స్క్రీన్‌ప్లే..
చివరిగా:
‘గోదారి గట్టు పైన’ మరీ అంత ఆహ్లాదాన్ని పంచలేకపోయినప్పటికీ, ఓకే, వేడెక్కించే సమ్మర్లో జస్ట్ ఓ కూల్ అండ్ ఫీల్ గుడ్ మూవీనే..
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









