విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- May 08, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు పావలా వడ్డీకే విద్యా రుణాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సంక్షేమ పథకాల సమీక్ష సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ వంటి దేశీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలతో పాటు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడనుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యా కలలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యలో ముందుకు రావాలని ప్రోత్సహించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతిభ ఉన్న యువతకు తగిన శిక్షణ ఇచ్చి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఎస్సీ, ఎస్టీ యువతకు జర్మన్ భాష శిక్షణ కూడా అందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా ‘సూపర్ సిక్స్’ పథకాల అమలుపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా 67 లక్షల మందికి రూ.10 వేల కోట్ల సహాయం అందిస్తున్నామని చెప్పారు. ‘స్త్రీశక్తి’ పథకం కింద మహిళలు కోట్ల సంఖ్యలో ఉచిత ప్రయాణాలు చేసినట్లు వెల్లడించారు.
బుడగజంగాలను ఎస్సీల జాబితాలో చేర్చే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని సీఎం తెలిపారు. కేంద్ర అనుమతులు వచ్చే వరకు ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
పేదల గృహ నిర్మాణంపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లకు, డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అదేవిధంగా భూవివాదాల పరిష్కారం, భూ రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల జారీ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేలా విద్య, వైద్యం, విద్యుత్ రంగాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







