రోబోటిక్ హిప్ రీప్లేస్‌మెంట్‌పై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు

- May 09, 2026 , by Maagulf
రోబోటిక్ హిప్ రీప్లేస్‌మెంట్‌పై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు

హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మే 9 మరియు 10 తేదీలలో “రోబోటిక్ అసిస్టెడ్ హిప్ రీప్లేస్‌మెంట్” పై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 500కు పైగా ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొననున్నారు. తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్, ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ, తెలంగాణ ఆర్థ్రోప్లాస్టీ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో జరుగుతుంది.

ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం యువ ఆర్థోపెడిక్ వైద్యులకు రోబోటిక్ మరియు కంప్యూటర్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలపై అవగాహన కల్పించడం, ఆధునిక సాంకేతికతలను నేర్పించడం మరియు భవిష్యత్తులో వీటిని వైద్య సేవల్లో విస్తృతంగా వినియోగించేందుకు ప్రోత్సహించడం.

ఈ సదస్సుకు అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అవుట్‌పేషెంట్ హిప్ మరియు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ ఆండ్రూ బి. విక్‌లైన్ (MD, FAAOS) ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయన భారతీయ ఆర్థ్రోప్లాస్టీ నిపుణులతో కలిసి శాస్త్రీయ చర్చలు, క్లినికల్ కేస్ డిస్కషన్లు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ విక్‌లైన్ మాట్లాడుతూ, “భారతీయ రోగుల్లో హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మరింత క్లిష్టంగా ఉంటాయి. చాలా మంది రోగులు చివరి దశలో మాత్రమే వైద్యులను సంప్రదిస్తారు. అప్పటికే ఎముకల బలం తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోబోటిక్ సర్జరీ ద్వారా ఇంప్లాంట్‌ను అత్యంత ఖచ్చితత్వంతో అమర్చడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతున్నాం” అన్నారు.

తన అమెరికా అనుభవాన్ని పంచుకుంటూ, “న్యూయార్క్‌లో మా కేంద్రంలో ప్రతి నెల 150కు పైగా హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు చేస్తుంటాం. అమెరికాలో రోబోటిక్ హిప్ రీప్లేస్‌మెంట్ చేయించుకున్న రోగులను సాధారణంగా శస్త్రచికిత్స అనంతరం కేవలం ఆరు గంటల్లోనే డిశ్చార్జ్ చేస్తారు. సరైన ప్రోటోకాల్స్ మరియు రోబోటిక్ టెక్నాలజీ ఖచ్చితత్వం వల్ల ‘సేమ్ డే డిశ్చార్జ్’ ఇప్పుడు సాధారణ ప్రక్రియగా మారింది” అని తెలిపారు.

మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌లో ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి మరియు చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్,ఈ కార్యక్రమం ఆర్గనైజింగ్ చైర్మన్ అయిన డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని మాట్లాడుతూ, “గత రెండు దశాబ్దాలుగా క్లిష్టమైన హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు నిర్వహిస్తున్నాం. రోబోటిక్ టెక్నాలజీతో ఇప్పుడు ఇంప్లాంట్లను మరింత ఖచ్చితత్వంతో అమర్చగలుగుతున్నాం.దీని వల్ల ఇంప్లాంట్ దీర్ఘకాలం నిలకడగా ఉండటంతో పాటు రివిజన్ సర్జరీ అవసరం తగ్గే అవకాశం ఉంది” అన్నారు.

భారతీయ రోగుల్లో ఉన్న ప్రత్యేక సవాళ్ల గురించి ఆయన మాట్లాడుతూ, “అమెరికా వంటి దేశాల్లో ప్రజలు సాధారణంగా పొడవుగా ఉండటంతో పాటు విటమిన్ లోపాలు తక్కువగా ఉంటాయి. కానీ భారతదేశంలో చాలా మంది విటమిన్ D, కాల్షియం లోపాలతో బాధపడుతుంటారు. దీనివల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. మరో ముఖ్య సమస్య ఏమిటంటే, వైద్యులు సర్జరీ అవసరమని చెప్పినా రోగులు వెంటనే ముందుకు రావడం లేదు. చాలా మంది రెండు నుంచి మూడు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నారు. అప్పటికి జాయింట్ పూర్తిగా దెబ్బతిని సర్జరీ మరింత క్లిష్టమవుతోంది. ఇలాంటి సందర్భాల్లో రోబోటిక్ సర్జరీ మెరుగైన ఖచ్చితత్వంతో మంచి ఫలితాలు అందిస్తోంది” అని తెలిపారు.

ఈ సందర్భంగా ఇండియన్ ఆర్థ్రోప్లాస్టీ అసోసియేషన్ (IAA) వైస్ ప్రెసిడెంట్ మరియు సీనియర్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ రాజ్‌కుమార్ నటేశన్ మాట్లాడుతూ, “రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ టెక్నాలజీ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల్లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది. ఇలాంటి అకాడమిక్ కార్యక్రమాల ద్వారా యువ వైద్యులు ఆధునిక సాంకేతికతను నేర్చుకోవడం వల్ల రోగులకు మరింత సురక్షితమైన చికిత్స, వేగవంతమైన కోలుకోవడం, మెరుగైన ఫలితాలు లభిస్తాయి. భవిష్యత్తులో మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్‌లో కూడా ఈ టెక్నాలజీని సాధారణ శిక్షణలో భాగం చేయాలి” అన్నారు.

అందుబాటు ధరల్లో రోబోటిక్ హిప్ రీప్లేస్‌మెంట్

అమెరికాలో హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సకు సాధారణంగా రూ.25 లక్షలకు పైగా ఖర్చవుతుందని, అదే చికిత్సను మెడికవర్ హాస్పిటల్స్‌లో దాదాపు మూడు రెట్లు తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. తెలంగాణతో పాటు పరిసర రాష్ట్రాల రోగులకు ఆధునిక రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొంది.

అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని టీచింగ్ హాస్పిటల్స్‌లో రోబోటిక్ మరియు కంప్యూటర్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ శిక్షణను విస్తృతంగా ప్రవేశపెట్టాలని పాల్గొన్న ఆర్థోపెడిక్ సంఘాలు సూచించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com