ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- May 12, 2026
న్యూ ఢిల్లీ: అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో పొదుపు పాటించాలని, దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ఇటీవల ప్రధాని మోదీ దేశ పౌరులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన విజ్ఞప్తిని మరోసారి పునరుద్ఘాటించారు. ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని పౌరులను మరోసారి కోరారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వర్క్-ఫ్రమ్-హోమ్ ఏర్పాట్లను ఆయన ప్రోత్సహించారు.
గుజరాత్‌లోని వడోదరలో సర్దార్‌ధామ్ హాస్టల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు. సరఫరా గొలుసులకు (సప్లయ్ చైన్) అంతరాయం కలగడంతో దిగుమతి వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. దేశ విదేశీ మారక నిల్వలపై భారాన్ని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సామూహిక భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు.
”దేశ దిగుమతుల్లో అధిక భాగం ముడి చమురు నుండే వస్తుంది. దురదృష్టవశాత్తు ప్రపంచంలోని చాలా భాగాలకు చమురును సరఫరా చేసే అదే ప్రాంతం ప్రస్తుతం సంఘర్షణ, అస్థిరతతో కూడిన పరిస్థితిలో చిక్కుకుంది. అందువల్ల, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు, దేశ విస్తృత ప్రయోజనాల కోసం మనమందరం మన దైనందిన జీవితాలలో చిన్నవైనా అర్థవంతమైన తీర్మానాలు తీసుకోవాల్సి ఉంటుంది” అని ప్రధాని మోదీ అన్నారు.
పెట్రోల్-డీజిల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించండి..
“పెట్రోల్-డీజిల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నా దేశ పౌరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మెట్రోను ఉపయోగించండి, ఎలక్ట్రిక్ బస్సులు, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించండి. కార్ పూలింగ్‌ను ప్రోత్సహించండి. కారు ఉన్నవారు ఒకే వాహనంలో ఎక్కువ మందిని తీసుకెళ్లాలి. డిజిటల్ టెక్నాలజీ ఇప్పుడు ఎన్నో విషయాలను సులభతరం చేసింది. టెక్నాలజీ సాయం కూడా మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వర్చువల్ సమావేశాలకు, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ క్లాసులకు ప్రధాని మోదీ పిలుపు..
స్కూల్ విద్యార్థుల కోసం తాత్కాలిక ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రధాని కోరారు. “ప్రస్తుతానికి ఆన్‌లైన్ తరగతుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను కొన్ని పాఠశాలలను కోరుతున్నాను” అని అన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఛారిటీ స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులకు షిఫ్ట్ అవ్వాలని ఆయన సూచించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేయాలని, కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. తాజాగా ఆన్ లైన్ క్లాసులకు వెళ్లండంటూ స్కూళ్లకు సైతం సూచన చేశారు.
దేశంలో బంగారం దిగుమతులపై భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతోందని ప్రధాని అన్నారు. పసిడి కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేయాలని పిలుపునిచ్చారు. విదేశీ వస్తువుల కంటే స్థానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యతనిచ్చే “వోకల్ ఫర్ లోకల్” కు ఆయన మద్దతు తెలిపారు.
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ దేశాల మధ్య యుద్ధం 3వ నెలలోకి ప్రవేశించింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సంఘర్షణపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







