శాన్ డియాగో మసీదులో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి
- May 19, 2026
అమెరికా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ డియాగో (San Diego) లో అత్యంత దారుణమైన సాయుధ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ప్రసిద్ధ “ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాన్ డియాగో” మసీదు ప్రాంగణంలోకి చొరబడిన ఇద్దరు టీనేజీ యువకులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ అమానుష దాడిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం ఇద్దరు నిందితులు కూడా తీవ్ర గాయాలపాలై, మసీదు సమీపంలో ఉన్న ఒక వాహనంలో నిర్జీవంగా పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతాన్ని “విద్వేష నేరం” (Hate Crime) కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు శాన్ డియాగో పోలీస్ చీఫ్ స్కాట్ వాల్ అధికారికంగా ప్రకటించారు.
ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ టీనేజర్లు ఏ కారణం చేత ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారనేది ప్రస్తుతానికి తెలియరాలేదని, దర్యాప్తులో మరిన్ని లీకులు, నిజాలు బయటపడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ కాల్పుల ఘటనకు ముందే అందులోని ఒక షూటర్ తల్లి స్థానిక పోలీసులకు ఒక కీలక ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన కుమారుడు కనిపించడం లేదని, ఇల్లాలు చెప్పిన వివరాల ప్రకారం.. అతడు ఇంట్లో ఉన్న ఆయుధాలతో పాటు తన వాహనాన్ని కూడా తీసుకుని వెళ్లినట్లు ఆమె పోలీసులకు ముందే సమాచారం అందించింది. ఇస్లామిక్ సెంటర్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాడిసన్ హై స్కూల్‌లోనే ఆ టీనేజర్ చదువుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ప్రాణాలు అడ్డుపెట్టిన సెక్యూరిటీ గార్డు.. స్కూల్ పిల్లలు సురక్షితం
ఈ కాల్పుల ఘటనలో మృతిచెందిన వారిలో ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు. ఆయుధాలతో లోపలికి దూసుకువస్తున్న ఆ టీనేజర్లను సెక్యూరిటీ గార్డు ప్రాణాలకు తెగించి అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. దుండగులను ఎదుర్కొనే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. ఆయన చూపిన ధైర్యం వల్లే మృతుల సంఖ్య పెరగకుండా భారీ ప్రాణనష్టం తప్పిందని పోలీసులు కొనియాడారు. శాన్ డియాగో కౌంటీలోనే అత్యంత భారీ, అతిపెద్ద మసీదుగా దీనికి గుర్తింపు ఉంది.
శాన్ డియాగో మసీదు ఆవరణలోనే “అల్ రషీద్” అనే ప్రసిద్ధ పాఠశాల కూడా నడుస్తోంది. ఈ స్కూల్‌లో అరబిక్ భాషతో పాటు ఇస్లామిక్ స్టడీస్ బోధిస్తారు. ఐదేళ్ల వయసు పైబడిన పిల్లలకు ఇక్కడ ఖురాన్ పఠనం నేర్పిస్తారు. కాల్పులు జరిగిన సమయంలో స్కూల్‌లో పిల్లలు ఉన్నప్పటికీ, వారంతా సురక్షితంగా ఉన్నట్లు యాజమాన్యం ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మసీదులో రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు జరుగుతుంటాయి. ఇతర మత సంస్థలతోనూ కలిసి ఈ కేంద్రం సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాగా, ఈ హేయమైన దాడిని “కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్” (CAIR) ముస్లిం సంఘం తీవ్రంగా ఖండించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







