తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- May 27, 2026
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. అత్యంత గరిష్టంగా 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన వడగాలులు వీస్తుండటంతో జనం విలవిలలాడిపోతున్నారు. ఎండల తీవ్రత, వడదెబ్బ కారణంగా ప్రతి రోజూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వడదెబ్బ మరణ మృదంగం మోగిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో దాదాపు 200 మంది దాకా వడదెబ్బకు బలైనట్టు సమాచారం. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 మంది వడదెబ్బబారిన పడి మృతిచెందగా సోమవారం ఒక్క రోజునే 54 మంది మృతిచెందారు. మంగళవారం కూడా రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఇద్దరు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో ఒకరు, కొమరంభీం ఆసీఫాబాద్ జిల్లాలో ఇద్దరు వడదెబ్బబారిన పడి ప్రాణాలు విడిచారు. ఎండల తీవ్రతకు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తూ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తెలంగాణలో మూడు రోజులపాటు (ఈనెల 28వరకు) ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుండి 46 డిగ్రీల వరకు నమోదవుతు న్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఆ జిల్లాలకు రెడ్ అలర్టు జారి చేసింది.
కాగా.. కొమరంబీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారి అయింది. అదే విధంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావి గూడలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత భద్రాద్రి కొత్త గూడెం, జగిత్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఖమ్మం, మంచిర్యాల, పెద్ద పల్లి జిల్లాల్లో 46.3 డిగ్రీలు, కరీంనగర్, మహబూబాబాద్, ములుగు, నిర్మల్ జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, వరంగల్, ఆదిలాబాద్, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే అయిదు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు బయటకు రావొద్దని హెచ్చరించింది. కాగా.. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణంలో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. మధ్యాహ్నం 2:30 తర్వాత లేదా సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలరాక మరింత ఆలస్యం కానుందన్న అంచనాల నేపథ్యంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు చురుకుగా కదలనున్నాయని, ఇందుకు వాతావరణం సానుకూలంగా ఉందని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవన వర్షాలు కురుస్తాయని ఐంఎడి హెచ్చరించింది. వాస్తవానికి మే 26 నాటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉన్నా వాతావరణ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో చకచకా కదిలిన రుతుపవనాలు.. శ్రీలంకలో సగం దూరం వచ్చాక ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఇందుకు ఎల్‌నినో ప్రభావమే కారణమని నిపుణులు చెబుతున్నారు. నైరుతి కదలికకు మంగళవారం సానుకూల వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో జూన్ 1 నాటికి కేరళను నైరుతి తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జూన్ 5 తర్వాత తెలంగాణను తొలకరి పలకరిస్తుందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







