ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్

- May 29, 2026 , by Maagulf
ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్

హైదరాబాద్: భారతదేశ ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.

హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీనటుడు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజార్ుద్దీన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, దేశ చరిత్రను చదివే ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌లను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశం ఉన్నంతకాలం వారి కీర్తి చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

“నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు ఎన్టీఆర్ కులాలు, మతాలు, భాషలకు అతీతుడు. ఆయన చూపిన మార్గంలో నడిచే వారిలో స్ఫూర్తిని నింపేందుకే ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. తెలంగాణ నుంచి అనేక మంది నాయకులకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారు. ఇది మరువలేని చరిత్ర” అని సీఎం అన్నారు.

తెలంగాణను ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్తామని చెప్పారు.

30 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మక ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలను తెలంగాణకు రప్పించడమే కాకుండా, రాష్ట్ర యువతను భవిష్యత్‌లో ఆ సంస్థల యజమానులుగా తీర్చిదిద్దే ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

రాష్ట్రంలో 3.24 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనికి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2 కిలో బియ్యం పథకమే స్ఫూర్తి అని సీఎం పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్ అమలు చేసిన కూడు, గుడ్డ, నీడ వంటి సంక్షేమ పథకాల స్ఫూర్తితో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. జనతా వస్త్రాల పథకానికి ప్రేరణగా ఆడబిడ్డలకు ‘ఇందిరమ్మ చీరలు’ పంపిణీ చేస్తున్నామని వివరించారు.

“ఇందిరమ్మ ఆశీర్వాదం, ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రజాపాలనలో ప్రతిఫలిస్తున్నాయి. ఇందిరమ్మ ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యుడు. వారిద్దరి ఆలోచనల కలయికే ఈనాటి ప్రజాపాలన” అని సీఎం వ్యాఖ్యానించారు.

మహిళల సాధికారతపై కూడా సీఎం మాట్లాడారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించగా, వాటిని ఎన్టీఆర్ అమలు చేశారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ, పార్లమెంట్‌లో తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

ప్రజల సహకారంతోనే ప్రజాపాలన విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్న సీఎం, భవిష్యత్తులో కూడా ప్రజలు అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు ఏకే.యాదవ్, వేమనరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పీఏసీ చైర్మన్ గాంధీ అరేకపూడి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కుమారులు నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు కూడా హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com