అంతర్జాతీయ వేదికపై ప్రదర్శనకు తెలంగాణ చిత్రాలు..

- August 08, 2016 , by Maagulf
అంతర్జాతీయ వేదికపై ప్రదర్శనకు తెలంగాణ చిత్రాలు..

 పారే సెలయేళ్లు, పచ్చని అడవులు, దుమికే జలపాతాల ప్రకృతి సోయగం తెలంగాణ ప్రత్యేకత. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలతో దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్న తెలంగాణ విశ్వ వేదికపై తన వైభవాన్ని ప్రదర్శించనుంది. తెలంగాణ టూరిజం ప్రమోషన్‌లో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన రెండు చిత్రాలు అంతర్జాతీయ చిత్రోత్సవానికి ఎంపికయ్యాయి. అక్టోబర్ 19 నుంచి నాలుగు రోజుల పాటు పోర్చుగల్‌లో జరగనున్న అంతర్జాతీయ టూరిజం ఫిల్మ్ పెస్టివల్‌లో ఈ చిత్రాలు ప్రదర్శించనున్నారు. చారిత్రక కట్టడాలు, అడవులు, జలపాతాలతో తెలంగాణ అతి రమణీయమైన పర్యాటక ప్రాంతంగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ పర్యాటకం స్వరాష్ట్రంలో కొత్త పుంతలు తొక్కడం గమనార్హం. నూతన రాష్ట్రంలో ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు చారిత్రక నిర్మాణాల మరమ్మతులపై దృష్టి సారించింది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త ప్రణాళికలను రూపొందించింది. ఈ క్రమంలో తెలంగాణ టూరిజం ప్రమోషన్‌లో భాగంగా ప్రత్యేకంగా చిత్రాలను రూపొందించింది. అత్యాధునిక టెక్నాలజీ తెలంగాణ టూరిజం ప్రమోషన్‌లో భాగంగా పది జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతను తెలిపేలా అత్యాధునిక టెక్నాలజీతో చిత్రాలను రూపొందించింది పర్యాటక శాఖ. డ్రోన్ టెక్నాలజీతో చిత్రీకరించిన ఈ చిత్రాలకు దూలం సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఆదిలాబాద్‌లో కుంటాల జలపాతాలు, వరంగల్ వేయి స్తంభాల గుడి, లక్నవరం, ఖమ్మం కిన్నెరసాని, హైదరాబాద్‌లో గోల్కొండ కోట, చార్మినార్ వంటి అనేకానేక పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతను తెలియజేస్తూ వెల్‌కమ్ టు తెలంగాణ పేరుతో ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసిన పర్యాటక శాఖ తాజాగా తెలంగాణ - ఎమర్జింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ పేరుతో మరో చిత్రాన్ని రూపొందించింది. హాలీవుడ్ స్థాయి చిత్రాల షూటింగ్ కోసం తెలంగాణలో అనువైన ప్రాంతాలపై ఈ చిత్రంలో ప్రధానంగా ఫోకస్ చేశారు. ఈ రెండు చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించడం గమనార్హం. తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన చిత్రాలపై యూకేకు చెందిన ఆన్‌లైన్ మ్యాగజైన్‌లో ఇటీవల ఒక సమీక్ష ప్రచురితమైంది. దీంతో అంతర్జాతీయ పర్యాటకుల చూపు తెలంగాణ వైపు మల్లింది. ఆహ్వానంతో.. తెంలగాణ పర్యాటకశాఖ రూపొందించిన చిత్రాలను ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ పంపాలని గత ఏప్రిల్‌లో ఆహ్వానం అందింది. దీంతో పర్యాటక శాఖ రెండు చిత్రాలను ఫిల్మ్ ఫెస్టివల్‌కి పంపింది. బెస్ట్ టూరిజం ప్రమోషన్ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు ఈ చిత్రాలు ఎంపికయ్యాయి. అక్టోబర్ 19 నుంచి 22వ తేదీ వరకు పోర్చుగల్‌లోని విలా నోవ గైయా నగరంలో ఈ చిత్రోత్సవంలో 52 దేశాలకు చెందిన 301 చిత్రాలు పాల్గొంటున్నాయి. కాగా ప్రభుత్వం రూపొందించిన చిత్రాలు అరుదుగా అంతర్జాతీయ ఫెస్టివల్స్‌కి ఎంపికవుతుంటాయి. కానీ తెలంగాణ టూరిజం రూపొందించి చిత్రాలు అంతర్జాతీయ వేదికపై ప్రదర్శనకు అర్హత సాధించడం గమనార్హం. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పర్యాటక రంగంలో తనదైన ముద్రను చాటుకొంటుందనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఈ చిత్రాలకు దర్శకత్వం వహించిన దూలం సత్యనారాయణ ప్రభుత్వం తనకు అరుదైన అవకాశాన్ని కల్పించిందని, ఇప్పుడా చిత్రాలు అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించబడుతుండడం మరింత సంతోషంగా ఉందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com