టీబీ నిర్మూలన, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన పెంచాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

- May 30, 2026 , by Maagulf
టీబీ నిర్మూలన, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన పెంచాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ఆసిఫాబాద్: టీబీ నిర్మూలన, మాదక ద్రవ్యాల నివారణ కోసం క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులను ఆదేశించారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించడం ద్వారా టీబీ, డ్రగ్స్ వంటి సామాజిక సమస్యలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని ఆయన అన్నారు.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో గవర్నర్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు, ఆరోగ్య సేవలు, టీబీ నివారణ చర్యల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సమాజ సేవలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా సింథటిక్ డ్రగ్స్ యువతకు తీవ్రమైన ముప్పుగా మారుతున్న నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. సమాజంలో ఎన్జీవోలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

టీబీ బాధితులకు పోషకాహారం అందించడం అత్యంత కీలకమని గవర్నర్ పేర్కొన్నారు. జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా సంస్థలు టీబీ రోగులను దత్తత తీసుకుని వారికి పోషకాహారం అందించాలని సూచించారు. టీబీ నిర్మూలన కార్యక్రమాలకు లోక్ భవన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను టీబీ, మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

4,064 మంది టీబీ రోగులకు పోషకాహారం

గవర్నర్ సూచనలకు స్పందించిన జిల్లా కలెక్టర్ కె. హరిత, జిల్లాలో నమోదైన 4,064 మంది టీబీ రోగులకు పోషకాహారం అందించే బాధ్యతను జిల్లా యంత్రాంగం స్వీకరిస్తుందని ప్రకటించారు. రెడ్ క్రాస్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తామని తెలిపారు.

అలాగే జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాన్ని పెంచడంతో పాటు సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు.

కలెక్టర్‌కు గవర్నర్ అభినందనలు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ విస్తరణలో విశేష కృషి చేసినందుకు జిల్లా కలెక్టర్ కె. హరితకు గవర్నర్ ప్రత్యేక మెమెంటో అందజేసి అభినందించారు.

ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం. దాన కిషోర్, జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మందా మకరందు, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

గవర్నర్‌కు ఘన స్వాగతం

జిల్లా పర్యటనలో భాగంగా ఆసిఫాబాద్‌లోని ఐడీఓసీకి చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మందా మకరందు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com