73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!

- May 31, 2026 , by Maagulf
73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!

దోహా: ఖతార్ వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో మొత్తం పేమెంట్ సిస్టమ్ లావాదేవీల సంఖ్య 73.533 మిలియన్లకు చేరుకుంది. ఇది 2025 ఏప్రిల్ లో నమోదైన 56.869 మిలియన్ల లావాదేవీలతో పోలిస్తే 29% పెరుగుదల నమోదైంది. డిజిటల్ చెల్లింపు మార్గాల వినియోగం గణనీయంగా పెరగడమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని అధికార వర్గాలు తెలిపాయి.

లావాదేవీల సంఖ్య పరంగా కార్డ్ చెల్లింపు వ్యవస్థలే టాప్ లో నిలిచాయి.  మొత్తం లావాదేవీలలో ఇవి 88.8% వాటాను కలిగి ఉన్నాయి. అయితే, గత ఏడాది నమోదైన 94.9% వాటాతో పోలిస్తే ఇది స్వల్పంగా తగ్గిందని పేర్కొన్నారు.

దీనికి భిన్నంగా ట్రాన్స్ ఫర్ చెల్లింపు వ్యవస్థల (transfer payment systems) వాటా 11.2 శాతానికి పెరిగింది. ఖాతా నుండి ఖాతాకు జరిగే బదిలీలు మరియు డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలపై ప్రజల ఆధారపడటం పెరుగుతోందని ఇది సూచిస్తోందని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ఇటీవల తన 'X' ప్లాట్‌ఫారమ్ లో వెల్లడించింది.

ఇక విలువ పరంగా చూస్తే, చెల్లింపు వ్యవస్థలో భారీ పెరుగుదల నమోదైంది. 2025 ఏప్రిల్ లో QR63.302 బిలియన్లుగా ఉన్న మొత్తం విలువ, ఈ ఏడాది ఏప్రిల్  నాటికి 77శాతం వృద్ధితో QR111.854 బిలియన్లకు చేరుకుంది.  

మరోవైపు, మొత్తం విలువలో కార్డ్ చెల్లింపుల వాటా తక్కువగా 19.8% నమోదైంది. కార్డ్‌లు విస్తృతంగా వినియోగంలో ఉన్నప్పటికీ, అధిక విలువ కలిగిన లావాదేవీలు మాత్రం ఎక్కువగా ట్రాన్స్ ఫర్ వ్యవస్థల ద్వారానే జరుగుతున్నాయని గణంకాలు స్పష్టం చేశాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో మొత్తం కార్డు లావాదేవీల సంఖ్య 65.322 మిలియన్లకు చేరుకుంది.  వీటి మొత్తం విలువ QR 22.2 బిలియన్లుగా ఉంది.

అలాగే, పాయింట్-ఆఫ్-సేల్ (POS) లావాదేవీలు 48.042 మిలియన్లకు పెరిగాయి. గతేడాది వీటి సంఖ్య 40.105 మిలియన్లుగా ఉంది. ఆన్‌లైన్ (ఈ-కామర్స్) లావాదేవీలు కూడా గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఇవి 8.953 మిలియన్ల నుండి 12.098 మిలియన్లకు పెరిగాయి.  ఇదే సమయంలో, ATM లావాదేవీల సంఖ్య గతేడాది నమోదైన 4.908 మిలియన్ల నుండి 5.182 మిలియన్లకు పెరిగాయి.

అదే విధంగా ఖతార్ మొబైల్ పేమెంట్ (QMP) తక్షణ బదిలీ వ్యవస్థల ద్వారా ప్రాసెస్ చేయబడిన మొత్తం లావాదేవీల విలువ QR 406.274 మిలియన్లకు చేరుకున్నాయి. 2025లో QR 174.741 మిలియన్లతో పోలిస్తే 133% భారీ పెరుగుదలను నమోదైంది. తక్షణ మరియు నగదు రహిత చెల్లింపు పద్ధతులపై వినియోగదారులు మరియు వ్యాపార సంస్థల విశ్వాసం పెరుగుతున్నట్లుగా ఈ గణంకాలు తెలిపాయి.  అలాగే రోజువారీ ఆర్థిక కార్యకలాపాల్లో మొబైల్ చెల్లింపు ప్లాట్ ఫామ్స్ మరింత విస్తృతం అవుతున్నట్లు స్పష్టమైంది. 

మరోవైపు, తక్షణ చెల్లింపు వ్యవస్థ అయిన 'ఫర్వాన్' సేవలో ఏప్రిల్ 2026 నాటికి 3.816 మిలియన్ల నమోదిత ఖాతాలు ఉన్నాయి.  వీటి మొత్తం విలువ QR 5.964 బిలియన్లు కాగా, లావాదేవీల పరిమాణం 3.490 మిలియన్లుగా నమోదైంది.

'Tahweel' వ్యవస్థలో (బ్యాంకు ఖాతాల మధ్య జరిగే బదిలీలు) కూడా వృద్ధి నమోదైనట్లు ఈ గణాంకాలు తెలిపాయి. ఈ వ్యవస్థలో లావాదేవీల విలువ పరంగా వరుసగా 106% మరియు 193% పెరుగుదల కనిపించింది. లావాదేవీల పరిమాణం వరుసగా, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 4 మిలియన్ల లావాదేవీలతో మొత్తం QR 83.283 బిలియన్ల విలువను చేరుకున్నాయని గణంకాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com