ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..

- June 03, 2026 , by Maagulf
ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..

కువైట్ సిటీ: ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1 దెబ్బతినడంతో, అక్కడ అత్యవసర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (PACA) బుధవారం విమానాశ్రయ అత్యవసర ప్రణాళికను అమల్లోకి తీసుకువచ్చింది. దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు, అలాగే విమానాశ్రయంలోని పలు సౌకర్యాలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

ఈ విషయాన్ని PACA ప్రతినిధి అబ్దుల్లా అల్-రజ్హీ వెల్లడించారు. కువైట్ న్యూస్ ఏజెన్సీ (KUNA) ప్రచురించిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను కాపాడటంతో పాటు విమానాశ్రయ సదుపాయాలను రక్షించేందుకు అత్యవసర నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

దాడి అనంతరం విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అన్ని విమానాలను సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు మళ్లిస్తున్నామని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

విమానాశ్రయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు భద్రతా మరియు సాంకేతిక అత్యవసర ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు అల్-రజ్హీ తెలిపారు. నష్టం ఎంత మేరకు జరిగిందో అంచనా వేయడానికి సాంకేతిక బృందాలు పరిశీలనలు నిర్వహిస్తున్నాయని, అనంతరం మరమ్మతు పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయ కార్యకలాపాల పునరుద్ధరణపై పరిస్థితులను సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com