ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్

- June 03, 2026 , by Maagulf
ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్

సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆడిటోరియంలో బుధ వారం రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోని సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో ప్రత్యేక బ్రీఫింగ్, ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ అధ్యక్షత వహించి, పోలీసింగ్‌లో ఎస్‌ఐల పాత్ర, ప్రజలతో సత్సంబంధాలు, సమర్థవంతమైన దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.

పల్లెటూరి మట్టిలో పుట్టి, ఎన్నో కష్టాలు పడుతూ, కుటుంబ త్యాగాలు, తల్లిదండ్రుల ఆశలు మోస్తూ ఎంతోమంది యువకులు ఎస్సై ఉద్యోగం సాధిస్తారు. ఆ ఉద్యోగం వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు దాగి ఉంటాయి.కానీ కొందరు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కష్టాలన్నీ, తమ మూలాలు, విలువలు మరిచిపోతున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను మరిచి అవినీతి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యం లో పోలీసు సైబరాబాద్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్స్ సిపి దిశ నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డా. ఎం.రమేష్ మాట్లాడుతూ, ఎస్‌ఐలు పోలీసు శాఖకు వెన్నెముక వంటివారని, ప్రజలకు మొదటగా స్పందించే ఫీల్డ్ స్థాయి అధికారులు వారేనని పేర్కొన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా స్వీకరించి, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగేలా పనిచేయాలని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల భాగస్వామ్యంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

దర్యాప్తు విషయంలో పారదర్శకత, నిష్పాక్షికత పాటించాలని, కేసుల దర్యాప్తును నాణ్యతతో పూర్తి చేయాలని సీపీ సూచించారు.  కమ్యూనల్ అంశాలపై అప్రమత్తత వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.  

పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పూట పట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని, ట్రాఫిక్ సమస్యలు, స్థానిక వివాదాలు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సీపీ తెలిపారు. పెట్రోలింగ్ మొబైల్స్ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు భద్రతాభావం కల్పించాలని తెలిపారు. అలాగే ఉన్నతాధికారులతో సమన్వయం పెంపొందించుకుని కేసుల దర్యాప్తులో ఎదురయ్యే సమస్యలను చర్చిస్తూ మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.

అదేవిధంగా పోలీసు శాఖలో క్రమశిక్షణ, వృత్తిపరమైన నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిరాధార ప్రచారాలు, పుకార్లు, బాధ్యతారహిత వ్యాఖ్యల ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, అలాంటి చర్యలు వ్యక్తిగతంగా మరియు శాఖాపరంగా ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. కార్యాలయాల్లో ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని నెలకొల్పేందుకు పరస్పర గౌరవం, సహకారం, జట్టు భావనతో పనిచేయాలని సూచించారు.

 అవినీతికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకూడదని కమిషనర్ స్పష్టం చేశారు. పోలీసు క్రమశిక్షణ, నైతిక ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. దర్యాప్తు విధానాలు, చట్టపరమైన ప్రక్రియలు, సాక్ష్యాల సేకరణ, కేసుల నిర్వహణకు సంబంధించిన పరిజ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకుని నాణ్యమైన దర్యాప్తు చేపట్టడం ద్వారా నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐలకు సూచించారు.

కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ, ఫీల్డ్ స్థాయిలో పనిచేసే ఎస్‌ఐలు ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని సూచించారు.ఫస్ట్ రెస్పాండర్స్‌గా సంఘటన స్థలానికి వేగంగా చేరుకుని సమర్థవంతంగా స్పందించడం ద్వారా ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసాన్ని పెంచాలని తెలిపారు. నిజాయితీ, పారదర్శకత, ఇంటిగ్రిటీని కాపాడుకుంటూ విధులు నిర్వహించడం ద్వారా పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాలని సూచించారు.

*శేరిలింగంపల్లి డీసీపీ సీ. హెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ,* పోలీసు అధికారులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలపై పూర్తి అవగాహన, పట్టు కలిగి ఉండాలని సూచించారు. ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలు అందిస్తూ ప్రతి ఫిర్యాదుపై సత్వర స్పందన కనబరచాలని తెలిపారు. విధి నిర్వహణలో నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ పోలీసు శాఖ పట్ల విధేయతతో పనిచేయాలని సూచించారు. శాఖ ప్రతిష్ఠను కాపాడటం ప్రతి పోలీసు బాధ్యత అని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు పోలీసులను ఆశాకిరణంగా భావిస్తారని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలతో వినయపూర్వకంగా, మర్యాదగా వ్యవహరిస్తూ పోలీసు శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని సూచించారు.

కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ, విధి నిర్వహణలో నైతిక విలువలు, వృత్తిపరమైన ప్రమాణాలను పాటించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. పోలీసు శాఖ ప్రభుత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, అందువల్ల ప్రతి నిర్ణయం బాధ్యతాయుతంగా, చట్టబద్ధంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎల్లప్పుడూ జెంటిల్‌మెన్‌లా ప్రవర్తిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచనలు, బ్రీఫింగ్ సెషన్లను సమర్థవంతంగా వినియోగించుకుని, ఇతర అధికారులతో పరస్పర చర్చలు జరుపుతూ తమ జ్ఞానం, అనుభవాలను పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్.కోటి రెడ్డి, అడ్మిన్ డీసీపీ టి.అన్నపూర్ణ, శేరిలింగంపల్లి డీసీపీ సి.హెచ్.శ్రీనివాస్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ వై.వి.ఎస్.సుధీంద్ర ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com