అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- June 03, 2026
అబూధాబి: అబూధాబిలోని BAPS హిందూ మందిరం ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’ను అందుకుంది. అబూధాబిలో నిర్వహించిన 3వ ఇంటర్నేషనల్ డైలాగ్ ఆఫ్ సివిలైజేషన్స్ అండ్ టాలరెన్స్ కాన్ఫరెన్స్ (IDCT 2026) సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా సహనం, పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డును అందజేస్తారు. అంతర్జాతీయ స్థాయిలో చూపిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని కాన్ఫరెన్స్ శాస్త్రీయ కమిటీ విజేతలను ఎంపిక చేస్తుంది.
ఎమిరేట్స్ స్కాలర్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ స్టడీస్ (ESCRS), అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సు, యూఏఈ ప్రకటించిన ‘ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ 2026’లో భాగంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, మతపెద్దలు, అంతర్జాతీయ సంస్థలు, సామాజిక నాయకులు పాల్గొని సంస్కృతుల మధ్య సంభాషణ, సహజీవనం, కుటుంబాలపై కృత్రిమ మేధ (AI) మరియు కొత్త మీడియా ప్రభావంపై చర్చించారు.
సామరస్యానికి గుర్తింపుగా అవార్డు
BAPS హిందూ మందిరం నిర్వహిస్తున్న ఫెస్టివల్ ఆఫ్ హార్మనీ, ఓంసియాత్, కోవిడ్ కాలంలో మరియు ప్రస్తుత సంక్షోభ సమయాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలు ఈ అవార్డు పొందడంలో కీలక పాత్ర పోషించాయి. యూఏఈతో పాటు ప్రపంచవ్యాప్తంగా సామరస్యం, పరస్పర అవగాహన, సామాజిక ఐక్యతను పెంపొందించడంలో మందిరం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది.
కుటుంబం, సాంకేతికత పై బ్రహ్మవిహారి స్వామి సందేశం
ఈ అవార్డును ఎమిరేట్స్ స్కాలర్ సెంటర్ ఛాన్సలర్ డాక్టర్ అబ్దుల్లా బెల్హైఫ్ అల్ నుఐమీ, మొహమ్మద్ బిన్ జాయెద్ యూనివర్సిటీ ఫర్ హ్యూమానిటీస్ ఛాన్సలర్ డాక్టర్ ఖలీఫా అల్ దహెరీ చేతుల మీదుగా అబూధాబి BAPS హిందూ మందిర్ అధిపతి బ్రహ్మవిహారి స్వామి స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబం, విశ్వాసం, సాంకేతికత భవిష్యత్తుపై ఆలోచనాత్మక ప్రసంగం చేశారు. కృత్రిమ మేధ ఎంత అభివృద్ధి చెందినా, మనుషుల మధ్య బంధాలు, కుటుంబ విలువలు, పరస్పర అనుబంధాలే సమాజానికి పునాది అని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ‘ఘర్ సభ’ అనే కుటుంబ సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ, ప్రతిరోజూ 20 నిమిషాలు కుటుంబ సభ్యులు కలిసి ప్రార్థన, సంభాషణ, ఆత్మపరిశీలనకు కేటాయించాలని సూచించారు. “స్క్రీన్లు కాదు, నోటిఫికేషన్లు కాదు, కుటుంబ సభ్యుల మధ్య నిజమైన సంభాషణే బలమైన బంధాలను నిర్మిస్తుంది” అని అన్నారు.
“AI Powered Families కాదు.. AI Empowered Families కావాలి”
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, దానికి విలువలు, మానవత్వం తోడవ్వాల్సిన అవసరం ఉందని బ్రహ్మవిహారి స్వామి పేర్కొన్నారు. “భవిష్యత్తు కేవలం తెలివైన యంత్రాలపై ఆధారపడదు. బలమైన కుటుంబాలు, కరుణతో కూడిన సమాజాలపై ఆధారపడి ఉంటుంది. మనకు AI Powered Families కంటే AI Empowered Families అవసరం” అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా యూఏఈ నాయకత్వం సహజీవనం, సంభాషణ, మానవ సోదరభావాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.




తాజా వార్తలు
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు









