ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- July 26, 2026
అబుదాబి: యూఏఈలో ప్రయాణికుల రైలు సేవలకు కొత్త అధ్యాయాన్ని తెరలేపిన ఎతిహాద్ రైల్ నెట్‌వర్క్ మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. అబుదాబి–ఫుజైరా మధ్య ప్రారంభ దశ సేవలు ప్రారంభమై నెల రోజులు కూడా కాకముందే ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వారాంతాల్లో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో ఎతిహాద్ రైల్ రానున్న స్టేషన్ల ప్రారంభ తేదీలు, టికెట్ ధరలు, అత్యంత సుందరమైన రైలు మార్గం, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.
సెప్టెంబర్ 30న రెండు కొత్త స్టేషన్లు
ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవల్లో తదుపరి కీలక ఘట్టం సెప్టెంబర్ 30, 2026. ఈ రోజున దుబాయ్ స్టేషన్ (జుమైరా గోల్ఫ్ ఎస్టేట్స్ సమీపంలో), అలాగే షార్జాలోని అల్ ధైద్ స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో అబుదాబి, దుబాయ్, షార్జా మధ్య రైలు అనుసంధానం మరింత బలోపేతం కానుంది.
మిగిలిన స్టేషన్ల ప్రారంభ షెడ్యూల్
నవంబర్ 30, 2026: అల్ ధఫ్రా ప్రాంతంలోని మదీనత్ జాయెద్, లివా స్టేషన్లు ప్రారంభం.
డిసెంబర్ 30, 2026: అల్ సిలా, అల్ ధన్నా, అల్ మిర్ఫా స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.
మార్చి 30, 2027: షార్జా యూనివర్సిటీ సిటీ స్టేషన్ ప్రారంభమవడంతో తొలి దశ ప్రయాణికుల నెట్‌వర్క్ పూర్తవుతుంది.
టికెట్ ధరలు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం అబుదాబి–ఫుజైరా మార్గంలో ప్రారంభ ఆఫర్‌గా 50 శాతం తగ్గింపు అందిస్తున్నారు.
కంఫర్ట్ క్లాస్: ప్రారంభ ధర Dh55 (సాధారణ ధర Dh109)
ప్రీమియం క్లాస్: ప్రారంభ ధర Dh120 (సాధారణ ధర Dh239)
ప్రతి క్లాస్‌లో సేవర్, వాల్యూ, ఫ్లెక్స్ అనే మూడు రకాల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. సేవర్ అత్యంత తక్కువ ధరలో లభిస్తే, వాల్యూ టికెట్‌లో సీటు ఎంపిక, పరిమిత మార్పులకు అవకాశం ఉంటుంది. ఫ్లెక్స్ టికెట్‌లో టికెట్ మార్పులతో పాటు రీఫండ్ సౌకర్యం కూడా కల్పించారు. పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి.
అయితే మిగిలిన మార్గాలకు సంబంధించిన టికెట్ ధరలను ఆయా సేవలు ప్రారంభానికి ముందు ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
అత్యంత సుందరమైన రైలు ప్రయాణం
ప్రస్తుతం అబుదాబి–ఫుజైరా మార్గం ఎతిహాద్ రైల్‌లో అత్యంత అందమైన ప్రయాణంగా గుర్తింపు పొందుతోంది. ఈ మార్గంలో ప్రయాణికులు అబుదాబి నగర దృశ్యాల నుంచి ఎడారి ఇసుక దిబ్బలు, అనంతరం హజర్ పర్వత శ్రేణుల్లో నిర్మించిన సొరంగాల గుండా ప్రయాణించి, చివరకు ఒమన్ గల్ఫ్ తీరంలోని ఫుజైరాకు చేరుకుంటారు.
ఎతిహాద్ రైల్ తొలి ఎమిరాతీ లోకో పైలట్ ఇబ్రహీం అల్ హమ్మాది మాట్లాడుతూ, ఒకే ప్రయాణంలో ఎడారి, పర్వతాలు, సముద్ర తీర అందాలను ఆస్వాదించే అవకాశం ప్రపంచంలోని చాలా తక్కువ రైలు మార్గాల్లోనే ఉంటుందని పేర్కొన్నారు.
చివరి గమ్యానికి సులభ అనుసంధానం
ఎతిహాద్ రైల్‌ను యూఏఈ ప్రజా రవాణా వ్యవస్థతో అనుసంధానం చేస్తున్నారు. ప్రతి స్టేషన్ వద్ద షటిల్ బస్సులు, టాక్సీలు, స్థానిక బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి.
అబుదాబిలోని మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ స్టేషన్ నుంచి కార్నిష్‌లోని ADNOC ప్రధాన కార్యాలయం, ADNEC సెంటర్, రీమ్ మాల్‌లకు ప్రత్యేక షటిల్ బస్సులు నడుస్తున్నాయి. అలాగే కొత్తగా MR1, MR2 బస్సు మార్గాలను కూడా ప్రారంభించారు.
దుబాయ్‌లో ఎతిహాద్ రైల్ స్టేషన్‌ను మెట్రో, RTA బస్సులు, టాక్సీలతో నేరుగా అనుసంధానించనున్నారు. అంతేకాకుండా నోల్ కార్డు ద్వారానే ఎతిహాద్ రైల్‌తో పాటు ప్రజా రవాణా సేవలకు చెల్లింపులు చేసే సౌకర్యం కూడా కల్పించనున్నారు.
పూర్తి నెట్‌వర్క్ ఎలా ఉంటుంది?
ఎతిహాద్ రైల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మొత్తం 900 కిలోమీటర్ల పొడవైన ప్రయాణికుల రైలు మార్గం యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌లో 11 నగరాలు, ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది.
ఈ నెట్‌వర్క్ సౌదీ సరిహద్దు సమీపంలోని అల్ సిలా నుంచి ఫుజైరా వరకు విస్తరించనుంది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసే స్టేషన్లు: అల్ సిలా, అల్ ధన్నా, అల్ మిర్ఫా, మదీనత్ జాయెద్, మెజైరా, మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ, అల్ ఫయా, దుబాయ్, యూనివర్సిటీ సిటీ (షార్జా), అల్ ధైద్, ఫుజైరా.
తాజా వార్తలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!
- బ్రిక్స్ పై గ్లోబల్ సౌత్‌కు నమ్మకం పెరిగింది: ప్రధాని మోదీ
- ఫిలిప్పీన్స్ లో బోటు ప్రమాదం..76కు చేరిన మరణాలు
- న్యూఢిల్లీలో పుతిన్‌తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ







