సినిమా రివ్యూ: ‘పెద్ది’.!

- June 04, 2026 , by Maagulf
సినిమా రివ్యూ: ‘పెద్ది’.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘పెద్ది’. రెండో సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన.దాంతో, ఈ సినిమాలో రామ్ చరణ్‌ని ఎలా హ్యాండిల్ చేశాడో అన్న క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. లార్జ్ స్కేల్‌లో రూపొందిన సినిమా కూడా కావడంతో అంచనాలూ ఆకాశాన్ని అంటేశాయ్. మరి, ఆ అంచనాల్ని ‘పెద్ది’ ఎంత మేర అందుకుంది.. తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

కథ:

ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయ నగరం జిల్లాలోని కొండ కింద వున్న ఓ గ్రామం అది. ఆ ఊరుకు అస్సలు గుర్తింపే వుండదు. ఆ ఊరి జనాలకు ఓటు హక్కు కూడా లేకపోవడంతో.. 450 మంది కుటుంబాలున్నప్పటికీ ఆ ఊరుకు ఎలాంటి గుర్తింపు వుండదు. పక్క ఊరికి కూలీకి వెళ్లి డబ్బులు సంపాదిస్తుంటారు ఆ ఊరి జనం. గుర్తింపు లేని ఊరు కావడంతో కూలీలోనూ పాక్షికత్వం చూపిస్తుంటారు. మిగిలిన వారితో పోల్చితే ఈ ఊరి జనాలకు సగం కూలీనే ఇచ్చి అవమానిస్తుంటారు. ఆ ఊరిలోనే పుట్టి పెరిగిన కుర్రాడు పెద్ది (రామ్ చరణ్). చిన్నతనం నుంచీ క్రికెట్ ఆటలో ధిట్ట. ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టగల మంచి ఆటగాడు కావడంతో.. భీమిలి క్రికెట్ జట్లు పెద్దిని వేలం పాటలో పాడుకుని తమ తమ టీమ్స్‌లో ఆడించేందుకు పోటీ పడుతుంటాయ్. అలా పెద్ది కారణంగా కాస్తో కూస్తో ఆ ఊరికి పేరొస్తుంది. తమ ఊరికి ఎలాగైనా గుర్తింపు తీసుకురావాలని 30 ఏళ్లుగా పోరాటం సాగిస్తుంటాడు అప్పలసూరి (జగపతిబాబు). కానీ, అనుకోని పరిస్థితుల్లో అప్పలసూరికి జరిగిన అన్యాయం పెద్దిని తనకెంతో ఇష్టమైన క్రికెట్ ఆటను వదులుకుని కుస్తీ పోటీల్లోకి దిగేలా ప్రేరేపిస్తుంది. క్రికెట్‌లో పోటుగాడైన పెద్ది, ప్రాణాలకు తెగించి కుస్తీ నేర్చుకుని, నేషనల్ స్థాయి వరకూ ఎదుగుతాడు. తద్వారా తన ఊరికీ, తన జాతికీీ గుర్తింపు తేవాలనుకుంటాడు. ఈ ప్రయాణంలో పెద్ది ఎదుర్కొన్న సవాళ్లు, అవమానాలు, కోల్పోయిన మనుషులు.. అనేకం. వీటన్నింటినీ తట్టుకుని పెద్ది తాను అనుకున్నది సాధించాడా.? అచ్చియమ్మ (జాన్వీ కపూర్)తో తన ప్రేమ ప్రయాణం ఎలా సాగింది.? కుస్తీ గురువు గౌర్ నాయర్ (శివ రాజ్‌కుమార్) పెద్దికి ఎలా వెన్ను దన్నుగా నిలిచాడు.? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే ‘పెద్ది’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.!

నటీనటుల పనితీరు:

దర్శకుడ్ని నమ్మి తనను తాను విపరీతమైన మేకోవర్‌లోకి మార్చుకున్న సినిమాలు రామ్ చరణ్ కెరీర్‌లో కొన్ని వున్నాయ్. అయితే, తన నమ్మకం ఆయా సినిమాల్లో వమ్ము కాబడిన సంఘటనలు అభిమానులకు తెలిసిందే. కానీ, ఈ సినిమా కోసం రామ్ చరణ్ దర్శకుడిపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యింది ఆ విషయంలో బుచ్చిబాబు సానాకు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. కూలీగా, క్రికెటర్‌గా, రెజ్లర్‌గా, ‘క్రాస్ ఓవర్’ అథ్లెట్‌గా రామ్ చరణ్ తెరపై కనిపించిన తీరు అద్భుతహ. ఓ స్టార్ హీరో ఇలాంటి ఓ కథని నమ్మడమే చాలా గ్రేట్.ఆ నమ్మకానికి బుచ్చిబాబు సానా పూర్తి న్యాయం చేశాడు. అక్కడక్కడా కొన్ని లోపాలున్నప్పటికీ, రామ్ చరణ్ తన నటనతో వాటన్నింటినీ సింపుల్‌గా పక్కకి తోసేశాడు. ఓ నటుడిగా ఈ సినిమాతో మరోసారి తన స్థాయినీ, స్థానాన్నీ ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు రామ్ చరణ్. రామ్ చరణ్ పాత్ర తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ పాత్ర అప్పల సూరి. ఈ పాత్రలో జగపతి బాబు కనిపించిన తీరు ఓ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ అని చెప్పాలి. స్టైలిష్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న జగపతిబాబుకి ఈ సినిమాలో అప్పలసూరి పాత్ర ఓ డిఫరెంట్. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను మాత్రం కేవలం గ్లామర్ కోసమే వ ాడాల్సి వచ్చింది దర్శకుడికి. అల్ట్రా గ్లామరస్ పాత్రలో అచ్చియమ్మగా జాన్వీ కపూర్ కనిపించింది ఈ సినిమాలో. కమర్షియల్ యాంగిల్‌లో మాత్రమే హీరోయిన్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్నారు. జన్యూన్‌గా అదే చేశాడు దర్శకుడు. అక్కడక్కడా కాస్త ఓవర్ అనిపించినా..ఎక్కడా తగ్గకుండా అంగాంగ ప్రదర్శన చేయడంలో హండ్రెడ్ పర్సంట్ మార్కులు కొట్టేసింది జాన్వీ కపూర్. కుస్తీ గురువుగా శివరాజ్ కుమార్ కథకి ఎంత అవసరమో అంతే నటించి, తనదైన హుందాతనం ప్రదర్శించారు.రావు రమేష్, దివ్యేందు శర్మ తదితర నటీ నటులు వున్నప్పటికీ ఆయా పాత్రల ప్రభావం పెద్దగా కనిపించదు. తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:

తాను నమ్ముకున్న కథని జన్యూన్‌గా కాన్ఫిడెంట్‌గా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. జన్యూన్ కథని చెప్పే క్రమంలో కమర్షియల్ హంగుల్ని చొప్పించడంలో కాస్త తడబడే అవకాశాలుంటాయ్. కానీ, ఆ తడబాటునంతటినీ ప్రథమార్ధానికి మాత్రమే పరిమితం చేసి, ద్వితీయార్ధాన్ని కేవలం కథ కోసమే ఫోకస్ చేయడానికి వాడాడు. ఒక సినిమా విజయం సాధించాలంటే అందుకు కమర్షియల్ హంగులు కూడా అవసరం కాబట్టి.. ఆ లోటు కూడా తీర్చేశాడు. తన ఊరికీ, తన జాతికీ గుర్తింపు తీసుకు రావడానికి ఓ కుర్రాడు చేసిన పోరాటమే ‘పెద్ది’ సినిమా కథ. ఇలాంటి ఓ కథని రామ్ చరణ్ నమ్మడం ఓ సాహసం. చరణ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బుచ్చిబాబు సానా ఎక్కడా తగ్గనివ్వలేదు. కూలీగా, క్రికెటర్‌గా, రెజ్లర్‌గా, అథ్లెట్‌గా చరణ్ ట్రాన్స్‌ఫార్మ్ అయిన విధానం సినిమాలో అక్కడక్కడా కొన్ని లోపాలున్నప్పటికీ వాటిని కవర్ చేసేస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకూ సాగే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడి హృదయాల్ని కదిలిస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ క్లైమాక్స్ కాకుండా.. ఓ సర్‌ప్రైజింగ్ క్లైమాక్స్‌ని ప్లాన్ చేసుకున్నాడు ‘పెద్ది’ సినిమా కోసం బుచ్చిబాబు సానా. అదే ఈ సినిమాకి హైలైట్. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకి ఇంకో బలం. ఫస్టాఫ్‌లో ‘చికిరి’ సాంగ్ సహా అన్ని పాటలు బాగున్నాయ్. నేపథ్య సంగీతం నెక్స్‌ట్ లెవల్. పోరాట ఘట్టాల్లో రెహమాన్ మ్యూజిక్ వేరే లెవల్ అనేలా వుంటుంది. కథతో పాటూ, బుచ్చిబాబు సానా అందించిన మాటలు మరో అస్సెట్. రత్సినవేలు నిమాటోగ్రఫీ సినిమాటిక్ సన్నివేశాల్ని సైతం నేచురల్‌గా మార్చేశాయ్. ముఖ్యంగా కుస్తీ సన్నివేశాలు చాలా నేచురల్‌గా అనిపిస్తాయ్. ఇద్దరు ఉద్ధండులైన రెజ్లర్లతో ఒకేసారి రామ్ చరణ్ తలపడే యాక్షన్ ఘట్టం తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే క్రికెట్‌లోనూ ఇంతవరకూ  ఎప్పుడూ చూడని కొన్ని కొత్త షాట్లను ఈ సినిమాలో చూపించారు. నిర్మాణ విలువలు సినిమాని నెక్స్‌ట్ లెవల్‌లో వుంచాయ్. ఇలా చెప్పుకుంటూ పోతే, సాంకేతిక వర్గం పనితీరు కూడా ఈ సినిమాకి చక్కగా కుదిరిందనొచ్చు. 

ప్లస్ పాయింట్స్:
రామ్ చరణ్ నటన, క్రికెట్ ఆటలోని కొత్త షాట్స్, రెజ్లింగ్ సన్నివేశాలు, భావోద్వేగాలు, ఊహించని ఓ ప్రత్యేకమైన క్లైమాక్స్.. మొదలైనవి.

మై‌నస్ పాయింట్స్:

కాస్త ఇబ్బందికరంగా అనిపించిన హీరోయిన్ పాత్ర, సాగతీతలా అనిపించిన ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు..

చివరిగా:

‘పెద్ది’...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని నటుడిగా మరో మెగా మెట్టు పై నిలబెట్టినట్లే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com