QRCS షెల్టర్ ప్రాజెక్టు.. 704 కుటుంబాలకు లబ్ధి..!!
- November 03, 2026
దోహా: బంగ్లాదేశ్‌లోని శరణార్థుల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (QRCS) కొత్త ఆశ్రయ ప్రాజెక్టును ప్రారంభించింది. బంగ్లాదేశ్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (BDRCS) భాగస్వామ్యంతో కాక్స్ బజార్ జిల్లాలోని శరణార్థి శిబిరాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం $517,877 ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా 704 శరణార్థి కుటుంబాలకు, అంటే 4,224 మందికి మధ్యకాలిక నివాస గృహాలను నిర్మించడంతో పాటు నిత్యావసర గృహోపకరణాలను పంపిణీ చేయనున్నారు.
శరణార్థి శిబిరాల్లో తీవ్ర రద్దీ, బలహీనమైన నివాస గృహాలు, వర్షాకాలంలో భారీ వర్షాలు, బలమైన గాలులు, అగ్నిప్రమాదాల ముప్పు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని QRCS వెల్లడించింది. ఈ పరిస్థితులు శరణార్థుల భద్రత, గోప్యత, జీవన స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. లబ్ధిదారుల ఎంపికలో ప్రత్యేక ప్రమాణాలను అనుసరించారు. మహిళా ఆధ్వర్యంలోని కుటుంబాలు, దివ్యాంగులు, వృద్ధులు, ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అత్యంత అవసరంలో ఉన్నవారికి సాయం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన, అర్హతల ధ్రువీకరణ చేపట్టారు.
QRCS బంగ్లాదేశ్ మిషన్ అధిపతి ఇంజినీర్ మొహమ్మద్ థాబెట్ సఫీ మాట్లాడుతూ.. శరణార్థి శిబిరాల్లో అత్యంత దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న కుటుంబాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సురక్షితమైన ఆశ్రయంతో పాటు అవసరమైన గృహోపకరణాలు అందించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల గౌరవాన్ని కాపాడుతూ వారు రోజువారీ జీవితాన్ని మెరుగ్గా కొనసాగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.
మరోవైపు, వింటర్ లో ఆశ్రయం లేని పేదలు, శరణార్థులు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించేందుకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి కూడా QRCS పిలుపునిచ్చింది. కాక్స్ బజార్‌లోని 1,208 పేద, శరణార్థి కుటుంబాలకు (7,248 మందికి) దుప్పట్లు అందించేందుకు QR144,960 అవసరమని తెలిపింది. ఈ మానవతా కార్యక్రమానికి వ్యక్తులు, సంస్థలు విరాళాలు అందించాలని కోరింది.
తాజా వార్తలు
- QRCS షెల్టర్ ప్రాజెక్టు.. 704 కుటుంబాలకు లబ్ధి..!!
- ఒమన్ – బ్రూనై మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- యూఏఈలో భారతీయ పాఠశాలల్లో దీపావళి సందడి..!!
- కువైట్‌లో ముగ్గురు ప్రవాసులకు మూడేళ్ల జైలు, బహిష్కరణ వేటు..!!
- ఏఎఫ్సీ ఆసియా కప్ 2027 షెడ్యూల్లో మార్పు..!!
- గల్ఫ్ డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక ముందడుగు..!
- ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!
- బహ్రెయిన్ పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు..!!
- యూఏఈలో వాహనాల కొనుగోలుపై కొత్త నిబంధనలు..!!
- భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!







