'పెద్ది'-చెర్రీ వన్ మ్యాన్ షో, కానీ కథలో ఆ మేజిక్ ఉందా?

- June 04, 2026 , by Maagulf
\'పెద్ది\'-చెర్రీ వన్ మ్యాన్ షో, కానీ కథలో ఆ మేజిక్ ఉందా?
గేమ్ చేంజర్ ప్లాప్ తర్వాత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ 'పెద్ది' సినిమా భారీ అంచనాలతో  థియేటర్లలోకి వచ్చేసింది. 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత మెగా పవర్ స్టార్, రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో బజ్ పెరిగింది. మరి ఈ ఎమోషనల్ ఫ్యామిలీ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందా? లేదా? ఇప్పుడు చూద్దాం. 
 
కథా నేపథ్యం
 
ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా, ఒక కొండ ప్రాంతం. ఎర్ర మట్టి, దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఊరి గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కనీసం కరెంటు ఉండదు, ఒక మంచి దారి ఉందు.. ఆస్పత్రికి కోసం వెళ్ళాలన్నా డోలీలే దిక్కు. 'అప్పల సూరి' (జగపతిబాబు) అనే ఒక సామాన్య రైతు, గత 30 ఏళ్లుగా తన ఊరిలో రైల్వే స్టేషన్ రావాలని, ఆ స్టేషన్ ద్వారా తన ఊరు వెలుగులోకి రావాలని ఒక కల కంటాడు. ఈ కలను నిజం చేసే శక్తి, ఒక సాధారణ కూలీగా, అత్యద్భుతమైన క్రీడాకారుడిగా ఉన్న 'పెద్ది' (రామ్ చరణ్) కి ఉందని అతను నమ్ముతాడు.
 
ఇక్కడ ఒక స్పోర్ట్స్ అధికారి (బొమన్ ఇరానీ) పాత్ర, దేశవ్యాప్తంగా ప్రతిభను వెతుకుతూ ఈ మారుమూల గ్రామానికి రావడం ద్వారా కథ మలుపు తిరుగుతుంది. ఒక వైపు క్రికెట్‌లో సిక్సర్ల మోత, మరోవైపు కుస్తీ పోటీల్లో గంభీరమైన కదలికలు.. పెద్ది ప్రతిభకు ఆ ఊరే ఒక వేదిక. అయితే, తన ఆత్మగౌరవం కోసం, తన ఊరి గుర్తింపు కోసం.. కేవలం డబ్బు కోసం ఆడే క్రీడాకారుడి నుంచి, బాధ్యత కలిగిన ఒక క్రీడాకారుడిగా పెద్ది ఎలా మారాడు? సమాజంలోని కుళ్లు రాజకీయాలను ఎదిరిస్తూ, గౌర్నాయుడు (శివరాజ్‌కుమార్) పర్యవేక్షణలో తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అన్నదే 'పెద్ది' సినిమా ప్రయాణం. 
 
నటీనటుల ప్రతిభ
 
రామ్ చరణ్ నటన ఈ సినిమాకు ప్రధాన బలం. సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ అద్భుతమైన నటనతో సినిమాను తన భుజాలపై మోశాడు. ఆయన క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా మూడు విభిన్న పాత్రల్లో చూపిన శ్రద్ధ, ఆ పాత్రలకు తగినట్టుగా శరీరధారుడ్యం కోసం పడిన కష్టం కళ్లకు కట్టినట్టుగా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఆయన కెరీర్‌లో ఒక మెమరబుల్ పర్ఫార్మెన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 
హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర విషయంలో సినిమా కొంత నిరాశపరుస్తుంది. ఈ సినిమాలోని సహజమైన గ్రామీణ వాతావరణానికి, అచ్యయమ్మ పాత్ర అస్సలు సరిపోలేదనిపిస్తుంది. ఆమెను చూస్తుంటే 'దేవర' సినిమాలోని పాత్రే గుర్తుకువస్తుంది. ఇలాంటి పక్కా లోకల్ కథల్లో, నేటితరం ఇండియన్ సినిమా ఇలాంటి పాత్రలను కథతో సంబంధం లేకుండా బలవంతంగా దూర్చడం వల్ల పాత్రల సహజత్వం దెబ్బతింటోంది. 
అయితే, రెండో భాగంలో శివరాజ్‌కుమార్ పాత్ర సినిమాకి ఎంతో బలాన్ని ఇచ్చింది. చరణ్-శివరాజ్‌కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా అలరిస్తాయి. జగపతి బాబు తన పాత్రకు న్యాయం చేశారు. 
 
బలాలు:
 
ఫస్ట్ హాఫ్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పోర్ట్స్ డ్రామా మరియు ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి.
సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
ముఖ్యంగా క్లైమాక్స్‌లో రామ్ చరణ్ చూపిన పెర్ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
లోపాలు:
సాంకేతికంగా ఈ సినిమా ఒక అద్భుతం. ఏఆర్ రెహమాన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ ఉత్తరాంధ్ర అందాలను, వాతావరణాన్ని చాలా సహజంగా కెమెరాలో బంధించింది. అయితే, కథనాన్ని అల్లిన విధానంలో లోపాలు ఉన్నాయి. కథా గమనం ఎక్కడా ఆగకుండా వెళ్లాల్సిన చోట, బలవంతపు కమర్షియల్ ఎలిమెంట్స్ కథలోని గాఢతను తగ్గించాయి. రావు రమేష్ లాంటి అద్భుతమైన నటుడికి తగిన ప్రాధాన్యత లేకపోవడం, బలమైన ప్రతినాయకుడు లేకపోవడం సినిమాకు మైనస్.
 
ముగింపు
'పెద్ది' ఒక బలమైన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. మూడు గంటల నిడివి కొంత భారంగా అనిపించినా, రామ్ చరణ్ నటన, దర్శకుడు బుచ్చిబాబు సానా చూపిన నిజాయితీ కోసం ఈ సినిమాను ఒకసారి తప్పక చూడవచ్చు. ఇది ఒక మాస్టర్ పీస్ అని చెప్పలేంకానీ,  ఒక ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు.
 
రేటింగ్: 3/5
--గణేశ్ తండ(హైదరాబాద్)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com