ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ

- June 05, 2026 , by Maagulf
ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ

అబూధాబి: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యూఏఈ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) మరియు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP) పలు అదనపు ముందుజాగ్రత్త చర్యలను ప్రకటించాయి.

ఈ చర్యలు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఎబోలా వైరస్‌కు సంబంధించిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దేశ భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అధికారుల ప్రకారం, 2026 జూన్ 6 శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ మూడు దేశాల పౌరులకు కొత్తగా జారీ చేసే అన్ని రకాల వీసాలు, సందర్శక (విజిట్) వీసాలు సహా, తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. అవసరాన్ని బట్టి ఈ ఆంక్షలను పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే సరుకు రవాణా (కార్గో) విమానాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అలాగే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు యూఏఈలో ప్రవేశం నిరాకరించబడుతుంది. ఇతర దేశాల ద్వారా ట్రాన్సిట్‌లో వచ్చిన ప్రయాణికులకూ ఇదే నిబంధన వర్తిస్తుంది. అయితే యూఏఈకి రాకముందు కనీసం 21 రోజులపాటు ఈ మూడు దేశాల వెలుపల గడిపినట్లు నిరూపించగలిగితే వారికి మినహాయింపు లభిస్తుంది. ట్రాన్సిట్ విమానాల సేవలపై మాత్రం ఈ ఆంక్షల ప్రభావం ఉండదని అధికారులు తెలిపారు.

ఎబోలా పరిస్థితిని స్థానిక, అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలతో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని NCEMA, ICP సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. వైరస్ ప్రభావం ఇతర దేశాలకు విస్తరించే అవకాశాలను కూడా అంచనా వేస్తూ, ప్రమాద స్థాయిని బట్టి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించాయి.

ప్రజారోగ్య రక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, ఆమోదిత ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com