ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం

- June 06, 2026 , by Maagulf
ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం

హైదరాబాద్: విద్యార్థుల రవాణాను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మరియు సాంకేతిక ఆధారితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ అమలుపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ శనివారం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు, ప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సభ్యులు, విద్యాసంస్థల రవాణా నిర్వాహకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విద్యార్థుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులను తరలించే ప్రతి వాహనం భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్ ఆధారిత రియల్‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థలు, అత్యవసర భద్రతా పరికరాలతో వాహనాలను సన్నద్ధం చేయాలని తెలిపారు. డ్రైవర్ల అర్హతలు, లైసెన్సులు, వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు వంటి అంశాలపై కఠిన పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు.

సమావేశంలో సైబరాబాద్ పోలీసులు, SCSC సంయుక్తంగా రూపొందించిన స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ పై ప్రత్యేక ప్రజెంటేషన్ నిర్వహించారు. విద్యార్థుల రవాణాలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, భద్రతా ప్రమాణాలు మెరుగుపరచడం, నిబంధనల అమలు మరియు అందుబాటు ధరల్లో రవాణా సేవలు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని వివరించారు.

ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ యాప్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన కీలక సమాచారాన్ని నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వాహనంలో విద్యార్థుల సంఖ్య, డ్రైవర్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ స్థితి, వాహనం ఫిట్‌నెస్, ప్రయాణ మార్గం, ప్రస్తుత లొకేషన్ వంటి వివరాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.

అదేవిధంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా విద్యార్థుల రవాణా వాహనాలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే అవకాశం ఉండటంతో పాటు విద్యార్థుల భద్రత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

విద్యార్థుల పికప్, డ్రాపింగ్ సేవలు, పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మరియు క్రీడా శిక్షణా కేంద్రాలకు వెళ్లే సమయంలో ఎదురయ్యే రవాణా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీపీ వివరించారు.

సమావేశంలో పాల్గొన్న ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులు ట్రాఫిక్ నిర్వహణ, ఆర్టీఓ అనుమతులు, లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను సీపీ దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై స్పందించిన సీపీ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సాధ్యమైన పరిష్కారాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉందని సీపీ తెలిపారు. విద్యార్థుల భద్రత, తల్లిదండ్రుల విశ్వాసం, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ మరియు సమర్థవంతమైన రవాణా వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

సమావేశంలో శేరిలింగంపల్లి ఎడిసిపి హనుమంతరావు, ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్టర్ శీతల్ సోహన్, మేడ్చల్ డీటీవో శ్రీనివాస్, ఆర్టీసీ డీఎంలు ప్రశాంత్, వెంకటేశం తదితర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com