7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!

- June 07, 2026 , by Maagulf
7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!

రియాద్: సౌదీ భద్రతా దళాలు ఒక వారం రోజుల్లో మొత్తం 7,760 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశాయి. మే 28 మరియు జూన్ 3 మధ్య కాలంలో సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో నిర్వహించిన సంయుక్త తనిఖీల సందర్భంగా ఈ అరెస్టులు జరిగినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్టు అయిన వారిలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు 4,060 మంది, సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు 2,574 మంది మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు 1,126 మంది ఉన్నారు.

సౌదీ సరిహద్దును దాటడానికి ప్రయత్నించిన మొత్తం 1,184 మందిని అరెస్టు చేశారు.  వీరిలో 28 శాతం మంది యెమెన్ , 70 శాతం మంది ఇథియోపియా మరియు రెండు శాతం మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.  మొత్తం 4,690 మంది అక్రమ నివాసితులను దేశం నుండి బహిష్కరించారు. అలాగే, 14,495 మంది ఉల్లంఘనదారులను ప్రయాణ పత్రాలు పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు రిఫర్ చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.

సౌదీలో చట్టాలను ఉల్లంఘించినవారికి ఆశ్రయం మరియు ఉపాధి కల్పించడంలో ప్రమేయం ఉన్న 16 మందిని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 21,774 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అక్రమ నివాసితులకు సహకరించే వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 1 మిలియన్ సౌదీ రియాల్స్ (SR) వరకు జరిమానా విధించబడుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అలాగే, వారు ఉపయోగించిన వాహనాలు, ఇళ్లను జప్తు చేస్తామని స్పష్టం చేసింది.

మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఏవైనా ఘటనలు ఉంటే 911 నంబర్‌కు, అలాగే మిగితా ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేసి వివరాలను తెలియజేయాలని ప్రజలను కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com