దుబాయ్ హార్బర్‌కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- June 07, 2026
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) దుబాయ్ హార్బర్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను షేక్ జాయెద్ రోడ్‌తో నేరుగా అనుసంధానించే కీలక బ్రిడ్జి నిర్మాణ ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దుబాయ్ హార్బర్‌కు వెళ్లే వాహనదారులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
1,500 మీటర్ల పొడవుతో, రెండు దిశల్లో రెండు లేన్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి దుబాయ్‌లోని ప్రముఖ సముద్రతీర, పర్యాటక కేంద్రంగా ఎదుగుతున్న దుబాయ్ హార్బర్‌కు ప్రత్యక్ష రాకపోకల సౌకర్యాన్ని కల్పించనుంది. మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద యాచ్ మెరీనా ఉన్న ఈ ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ అందించడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
RTA తెలిపిన వివరాల ప్రకారం, ప్రాజెక్టులో పునాదులు, స్తంభాలు, కాంక్రీట్ బ్యారియర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం 12 బృందాల్లో 1,400 మంది ఇంజినీర్లు, కార్మికులు పనిచేస్తుండగా, మొత్తం 42 లక్షల పని గంటలు నమోదు అయ్యాయి. నిర్మాణంలో 45,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 8,273 టన్నుల ఉక్కును వినియోగించారు.
ప్రాజెక్టు షెడ్యూల్ ప్రకారం, ఈ జూన్‌లో షేక్ జాయెద్ రోడ్ నుంచి దుబాయ్ హార్బర్‌కు వెళ్లే ట్రాఫిక్‌కు బ్రిడ్జిను అందుబాటులోకి తీసుకురానున్నారు. జూలైలో దుబాయ్ హార్బర్ నుంచి అల్ నసీమ్ స్ట్రీట్ వైపు, అలాగే కొత్త వంతెన నుంచి కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ స్ట్రీట్ జంక్షన్ వైపు ట్రాఫిక్ ప్రారంభం కానుంది.
RTA డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తయ్యర్ మాట్లాడుతూ, నగర అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగానే ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. షమల్ హోల్డింగ్‌తో భాగస్వామ్యంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు, దుబాయ్ హార్బర్‌కు స్థిరమైన ట్రాఫిక్ పరిష్కారాలను అందించడమే కాకుండా నివాసితులు, పర్యాటకుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
వంతెన ప్రారంభమైన తర్వాత దుబాయ్ హార్బర్‌కు ప్రయాణ సమయం 12 నిమిషాల నుంచి కేవలం 3 నిమిషాలకు తగ్గనుందని, గంటకు సుమారు 6,000 వాహనాల రాకపోకలను నిర్వహించే సామర్థ్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
షమల్ హోల్డింగ్ సీఈఓ అబ్దుల్లా బిన్ హబ్తూర్ మాట్లాడుతూ, ఈ వంతెన దుబాయ్ హార్బర్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







