బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!

- September 17, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!

మనామా: బహ్రెయిన్‌లో తెలియని నంబర్లు, వాట్సాప్ ఖాతాల నుంచి వచ్చే ఛారిటీ విజ్ఞప్తులకు స్పందించి డబ్బులు పంపవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. మంచి ఉద్దేశంతో పంపిన విరాళాలు అనుకోకుండా ఉగ్రవాద సంస్థలకు చేరే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.

హిద్ పోలీస్ స్టేషన్ అధిపతి కల్నల్ డాక్టర్ ఒసామా బహర్ మాట్లాడుతూ.. విరాళం ఇచ్చే ముందు డబ్బులు సేకరిస్తున్న వ్యక్తులు లేదా సంస్థ ఎవరో, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ‘అమన్’ సిరీస్ వీడియోలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు.

చిన్నారుల ఫొటోలతో మోసపోవద్దు
సహాయం అవసరమైన చిన్నారుల ఫొటోలు, భావోద్వేగ సందేశాలతో కొందరు ప్రజలను విరాళాలు ఇవ్వడానికి ప్రేరేపిస్తున్నారని కల్నల్ డాక్టర్ ఒసామా బహర్ తెలిపారు. అలాంటి సందేశం వచ్చినప్పుడు వెంటనే డబ్బులు పంపకుండా.. ఆ సంస్థకు అధికారిక అనుమతి ఉందా? వెబ్‌సైట్ నిజమైనదేనా? డబ్బులు ఎవరికి వెళ్తాయి? అనే విషయాలను ముందుగా నిర్ధారించుకోవాలని సూచించారు.

ఉగ్రవాద సంస్థలకు చేరే ప్రమాదం
ప్రజలు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పంపే డబ్బు.. బహ్రెయిన్‌కు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల తెలియని నంబర్లు లేదా వాట్సాప్ ఖాతాల నుంచి వచ్చే విజ్ఞప్తులకు స్పందించకుండా అధికారికంగా ఆమోదించబడిన ఛారిటీ సేవల ద్వారా మాత్రమే విరాళాలు ఇవ్వాలని కోరారు.

అధికారిక సేవలను వినియోగించాలి
విరాళాలు ఇవ్వడానికి జకాత్ ఫండ్, ‘Fael Khair’ వంటి అధికారిక సేవలను ఉపయోగించుకోవచ్చని కల్నల్ డాక్టర్ ఒసామా బహర్ తెలిపారు. ‘Fael Khair’ ద్వారా అప్పులు చెల్లించలేని వ్యక్తులకు సహాయం చేయవచ్చని, సహాయం చేయాలనుకునే వ్యక్తులు సంబంధిత కేసుల వివరాలను పరిశీలించిన తర్వాత ఎవరికి సహాయం చేయాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

లైసెన్స్ లేకుండా విరాళాలు సేకరిస్తే నేరం
మంచి ఉద్దేశం ఉన్నంత మాత్రాన సరిపోదని, విరాళాలు సేకరిస్తున్న వ్యక్తులు లేదా సంస్థకు అధికారిక లైసెన్స్ ఉందా లేదా కూడా తనిఖీ చేయాలని పోలీసులు సూచించారు. బహ్రెయిన్ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ లేకుండా ప్రజల నుంచి డబ్బులు సేకరించడం క్రిమినల్ నేరం అని కల్నల్ డాక్టర్ ఒసామా బహర్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com