తిరుమల శ్రీవాణి టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు..

- June 08, 2026 , by Maagulf
తిరుమల శ్రీవాణి టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు..

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే సాధారణ భక్తులకు కల్పించే సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే సామాన్య భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్యను కుదించింది. తాజాగా శ్రీవాణి ట్రస్ట్‌కు రూ. 10,000 విరాళం అందించే దాతల దర్శన టికెట్ల కేటాయింపు విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్ బుకింగ్‌లో జరిగే అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది.

కొత్త కోటా విభాగాలు–అడ్వాన్స్ బుకింగ్స్:
టీటీడీ ప్రస్తుతం ప్రతిరోజూ జారీ చేసే 1,500 శ్రీవాణి టికెట్ల(TTD Srivani Tickets) కోటాను వివిధ విభాగాలుగా విభజించింది. భక్తులు తమ పర్యటనను ముందే ప్లాన్ చేసుకునేలా 500 టికెట్లను మూడు నెలల ముందే ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. విమాన ప్రయాణికుల కోసం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో రోజువారీ కరెంట్ బుకింగ్ కింద 200 టికెట్లను యథావిధిగా కేటాయిస్తోంది. మిగిలిన రోజువారీ కోటాలో విరాళం ఇచ్చి దర్శనం కోసం వేచి చూస్తున్న దాదాపు 41 వేల మంది బ్యాక్‌లాగ్ దాతల కోసం ప్రత్యేకంగా రోజూ 300 టికెట్లను కేటాయించాలని నిర్ణయించింది.

జూన్ 10 నుండి అమలు–లక్కీడిప్ విధానం:
ఈ కొత్త నిబంధనలు జూన్ 10 నుండి అమల్లోకి రానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదలయ్యే ఈ టికెట్లను మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకుంటే, అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ ప్రత్యేక కోటా టికెట్లు మిగిలిపోతే వాటిని కరెంట్ బుకింగ్‌కు బదిలీ చేస్తారు. ఈ విధానం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. భవిష్యత్తులో శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కోసం లక్కీడిప్ విధానాన్ని తీసుకురావడంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల్లోనూ కౌంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com