సింగపూర్‌లో పాస్‌పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు

- June 08, 2026 , by Maagulf
సింగపూర్‌లో పాస్‌పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు

సింగపూర్: సింగపూర్‌లోని భారత హై కమిషన్‌లో పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా సేవలందించి బదిలీపై స్వదేశానికి వెళ్తున్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణకు శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సభ, సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి 50 మందికి పైగా తెలుగు ప్రముఖులు, ప్రవాస భారతీయులు హాజరయ్యారు. సభలో సంస్థ అధ్యక్షుడు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ, సింగపూర్‌లోని తెలుగు సమాజానికి కృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో, పాస్‌పోర్ట్ సంబంధిత సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, సహకారం ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.

పాస్‌పోర్ట్ సేవలకే పరిమితం కాకుండా భారత హై కమిషన్‌కు సంబంధించిన అనేక అంశాల్లో ప్రజలకు మార్గనిర్దేశం చేసి, సమస్యల తీవ్రతను అర్థం చేసుకుని సమయపాలనతో స్పందించడం కృష్ణ ప్రత్యేకత అని కొనియాడారు. గత మూడున్నర సంవత్సరాలుగా వ్యక్తిగతంగా, అలాగే సంస్థ తరఫున ఆయనతో ఏర్పడిన అనుబంధాన్ని తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. కృష్ణ బదిలీ సింగపూర్ తెలుగు సమాజానికి ఒక లోటుగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు.

తెలుగు సమాజం చూపిన అభిమానానికి కృతజ్ఞతలు

సన్మానానికి స్పందించిన వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణ, వారాంతమైన ఆదివారం రోజున ఇంతమంది తెలుగు సోదరులు కలిసి తనకు వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు.

కోవిడ్ అనంతర కాలంలో సింగపూర్‌లో బాధ్యతలు స్వీకరించిన సమయంలో అనేక అత్యవసర, క్లిష్టమైన కేసులు ఎదురయ్యాయని గుర్తుచేశారు. కార్యాలయ సమయాలు, వారాంతాలు అనే పరిమితులు లేకుండా వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశానని తెలిపారు. కొన్ని క్లిష్టమైన కేసులను ఎలా పరిష్కరించామో సభికులతో పంచుకున్నారు.

సింగపూర్‌లోని తెలుగు సంఘాలతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మధుర జ్ఞాపకాలను స్మరించుకున్నారు. భారతీయులతో పాటు సింగపూర్ పౌరసత్వం పొందిన భారతీయ మూలాల ప్రజలు భారత్‌కు ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అవగాహన కల్పించారు.

సింగపూర్‌లో గడిపిన కాలం తన జీవితంలో ఎప్పటికీ మధురస్మృతిగా నిలిచిపోతుందని, తెలుగు సమాజం నుంచి లభించిన ప్రేమాభిమానాలు మరువలేనివని కృష్ణ పేర్కొన్నారు.

పలువురు ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాంబాబు పాతూరి, చామిరాజు రామాంజనేయులు, సుధాకర్ జొన్నాదుల, శ్రీధర్ భరద్వాజ్, సుబ్బు వి.పాలకుర్తి పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ కుమారుడు కె.నాగేంద్రతో పాటు సింగపూర్‌కు చెందిన పలువురు తెలుగు ప్రముఖులు కూడా హాజరై కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ యజమాని సురేంద్ర చేబ్రోలు, మనోహర్ ఇంటూరి, మోహన్ నూకలలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com