స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- June 08, 2026
హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడానికి డీజీపీ సి.వి.ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు.గతంలో అమలులో ఉండి కొంతకాలంగా నిలిచిపోయిన ‘స్టాఫ్ ఆఫీసర్స్ మీటింగ్’ విధానాన్ని ఆయన పునరుద్ధరించారు.
ప్రతి రెండు వారాలకు ఒకసారి నిర్వహించే ఈ సమావేశంలో డీజీపీ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు, వివిధ విభాగాధిపతులు (హెచ్వోడీలు) పాల్గొని విధానాలు, కార్యక్రమాలు, పరస్పర సమన్వయం అవసరమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాల లేమి కారణంగా శాఖలోని పలు విభాగాల మధ్య సమన్వయ లోపం ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
తొలి సమావేశంలో కీలక అంశాల పై చర్చ
పునరుద్ధరించిన ఈ సమావేశం తొలి విడతలో పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. విదేశీ గృహ కార్మికుల (ఫారిన్ డొమెస్టిక్ వర్కర్స్) వివరాలను సమగ్ర డేటాబేస్ రూపంలో నిర్వహించడం ద్వారా మెరుగైన పర్యవేక్షణ, భద్రతా చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలించారు.
అలాగే సీసీటీఎన్ఎస్ 2.0 (Crime and Criminal Tracking Network & Systems) అమలు, సాంకేతిక ఆధారిత పోలీసింగ్, కృత్రిమ మేధస్సు (AI), డ్రోన్లు, డేటా ఇంటెలిజెన్స్ వ్యవస్థల వినియోగాన్ని పెంపొందించే దిశగా కార్యాచరణపై చర్చ జరిగింది.
ట్రాఫిక్ భద్రతకు కొత్త వ్యవస్థ
రాబోయే ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇతర విభాగాల పరిపాలనా నిర్మాణంపై కూడా సమావేశంలో చర్చించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమైన చర్యలను పరిశీలించారు.
మహిళా పోలీసుల సంక్షేమం పై దృష్టి
మహిళా పోలీసు సిబ్బంది పనివాతావరణం, లింగ సమానత్వం మెరుగుపరిచే లక్ష్యంతో నిర్వహించిన ఉమెన్స్ సమ్మిట్‌లో వచ్చిన సిఫార్సులను అమలు చేయాలని డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. మహిళా సిబ్బందికి మరింత అనుకూలమైన విధానాలను రూపొందించాలని సూచించారు.
ఇతర పరిపాలనా అంశాలు
ఈ సమావేశంలో పోలీసు సంఘాల ఎన్నికలు, సిబ్బంది మరియు వాహనాల ఆడిట్, సంక్షేమ నిధుల ఆడిట్, రాష్ట్రంలోని నాలుగు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కూడా చర్చించి తగిన సూచనలు చేశారు.
శాఖలో సమర్థవంతమైన పరిపాలన, ఆధునిక సాంకేతిక వినియోగం, విభాగాల మధ్య సమన్వయం పెంపు లక్ష్యంగా ఈ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- జూన్ 13న హైదరాబాద్‌లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్‌లో పాస్‌పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే









