జూన్ 13న హైదరాబాద్‌లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్

- June 08, 2026 , by Maagulf
జూన్ 13న హైదరాబాద్‌లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్

హైదరాబాద్‌: జూన్ 13న హైదరాబాద్‌లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్ మ్యాజికల్ అనుభూతిని అందించబోతోంది.ప్రేక్షకులు అద్భుతమైన మ్యూజిక్, డ్యాన్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన గ్రాండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించబోతున్నారు: సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్, ఏసీటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఓజీ టూర్ ఇండియా’ మెగా మ్యూజికల్ ఈవెంట్ జూన్ 13న హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో గ్రాండ్‌గా జరగనుంది. సంగీత ప్రియులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందించనున్న ఈ మ్యూజికల్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ నిర్వాహకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఓజీ సినిమా అప్రిషియేషన్ సెలబ్రేషన్‌ను కొనసాగిస్తూ ‘ఓజీ టూర్ ఇండియా’ను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌లో తొలిసారిగా ఈ ఈవెంట్ నిర్వహించడం ఆనందంగా ఉంది. అనిరుధ్ గారి ‘హుకుం టూర్’ ఎంతటి ప్రభావాన్ని చూపిందో, మనకు ‘ఓజీ టూర్’ కూడా అంతటి బలాన్ని ఇచ్చింది. ఎక్కడ చూసినా ‘ఓజీ’ మ్యూజిక్ వినిపిస్తోంది. ఆ సెలబ్రేషన్‌ను ఒక ఐకాన్‌గా తీసుకుని ఈ కాన్సర్ట్ ను రూపొందించాం. ఏసీటీసీ  ఈవెంట్స్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నిజానికి జూన్ 6న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే వర్ష సూచనల కారణంగా వాయిదా వేసి, ఇప్పుడు జూన్ 13న నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరగనుంది. ఈ కాన్సర్ట్  చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు నుంచే పలువురు ప్రముఖులను కలుస్తున్నాం. వచ్చే వారం రోజుల పాటు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాం. అలాగే కమిషనర్ గారిని, డీఐజీ గారిని కూడా కలిసి ఈవెంట్ అద్భుతంగా జరిగేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మాకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి భద్రత, సౌకర్యాలే మా తొలి ప్రాధాన్యత. ప్రేక్షకులు ఎంతో సౌకర్యవంతంగా, ఆనందంగా ఈ షోను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మా టీమ్ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తోంది.

సినిమా వేడుకల్లో మీ అందరినీ కలుస్తూనే ఉంటాను. కానీ తొలిసారి ఇలా వ్యక్తిగతంగా ‘ఓజీ టూర్ ఇండియా’ ద్వారా కలవడం చాలా ఆనందంగా ఉంది. జూన్ 13న హైదరాబాద్‌లో, జూలై 11న బెంగళూరులో, ఆగస్టు 15న చెన్నైలో, సెప్టెంబర్ 25న వైజాగ్‌లో ఈవెంట్లు నిర్వహిస్తున్నాం. ఈ నాలుగు నగరాల్లో జరగనున్న టూర్‌కు హైదరాబాద్ నుంచే గ్రాండ్ స్టార్ట్ ఇస్తున్నాం. మీ అందరి ప్రోత్సాహం, సహకారం కావాలి.

నేను చేసే ప్రతి షో ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌ను ఎప్పుడూ చారిటీకి అందిస్తుంటాను. ఈ షోకు సంబంధించిన వివరాలను కూడా కార్యక్రమం పూర్తైన తర్వాత వెల్లడిస్తాను.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నేను చేసిన సూపర్ హిట్ పాటలను ఎంపిక చేసి, అద్భుతమైన కొరియోగ్రఫీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ ఈవెంట్‌లో అందరి హీరోల పాటలు ఉంటాయి. ఇలాంటి లైవ్ షోలు చేయడం వల్ల ప్రేక్షకులతో ప్రత్యక్ష అనుబంధం పెరుగుతుంది. ఏ పాటలకు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడం భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ కాన్సర్ట్ పూర్తిగా మ్యాజికల్‌గా ఉండబోతోంది. మా ప్లేలిస్ట్ చూస్తుంటే మాకే ఎనర్జీ వస్తోంది. ఫైర్‌వర్క్స్, ఎల్‌ఈడీ స్క్రీన్స్, 3డీ ఎఫెక్ట్స్, డాన్స్ పెర్ఫార్మెన్స్‌లు అన్నీ అద్భుతంగా ఉంటాయి. గత కొన్ని రోజులుగా నేను కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ షోలో ఫుల్ లెంగ్త్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఉంటాయి.  

ప్రస్తుతం నేను చేస్తున్న NBK111, Mega158, అదర్శ కుటుంబం, లెనిన్ , ఇట్లు అర్జున చిత్రాలు అద్భుతంగా రూపొందుతున్నాయి. ఇవన్నీ కూడా బ్లాక్‌బస్టర్ సినిమాలుగా నిలుస్తాయి.

ఏసీటీసీ నిర్వాహకుడు సరవణన్ వాసు మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. తమన్ గారితో కలిసి ఈ టూర్ చేయడం చాలా ఆనందంగా ఉంది.ఆయన ‘ఓజీ టూర్ ఇండియా’ గురించి చెప్పినప్పుడే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఎందుకంటే నేటి జెన్-జీ యువత అంతా ఆయన పాటలతో వైబ్ అవుతున్నారు. ఈ ఈవెంట్ ప్రేక్షకులకు గొప్ప ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com