పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- June 13, 2026
యూఏఈ: యూఏఈలో భారతీయులకు అందించే పాస్‌పోర్ట్, వీసా, ఇతర కాన్సులర్ సేవలను 2026 జూలై 1 నుంచి అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎల్‌ఎల్‌సీ నిర్వహించనున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఎంబసీ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా వివరాలు వెల్లడించింది.
సేవల నిర్వహణ సమయాలు, దరఖాస్తు విధానాలు, ఇతర ప్రక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు ఎంబసీ తెలిపింది.
ప్రస్తుతం యూఏఈలో నివసిస్తున్న 35 లక్షలకు పైగా భారతీయ ప్రవాసులపై ఈ మార్పు ప్రభావం చూపనుంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మరియు ఎస్‌జీఐవీఎస్ గ్లోబల్ సంస్థలు 2026 జూన్ 30 వరకు తమ సేవలను కొనసాగించనున్నాయి. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను అప్పటి వరకు ప్రస్తుత సేవా కేంద్రాల ద్వారానే పూర్తి చేసుకోవాలని దరఖాస్తుదారులకు సూచించారు.
యూఏఈ వ్యాప్తంగా 16 సేవా కేంద్రాలు
భారతీయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆల్హింద్ యూఏఈలో భారీ స్థాయిలో సేవల విస్తరణకు సిద్ధమవుతోంది. దేశంలోని ఏడు ఎమిరేట్లలో మొత్తం 16 ప్రత్యేక సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
అబుధాబి, దుబాయ్, ఫుజైరా సహా కీలక ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. వీటిలో అతిపెద్ద కేంద్రం బుర్ దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నారు. సుమారు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 45కు పైగా సర్వీస్ కౌంటర్లతో ఈ కేంద్రం పనిచేయనుంది.
సేవా రుసుము కేవలం 19 దిర్హంలు
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు, వేచిచూడే సమయాన్ని తగ్గించేందుకు అల్ హింద్ చర్యలు చేపడుతోంది.సేవా రుసుమును కూడా అందుబాటులో ఉంచుతూ ప్రభుత్వ ఫీజులు మినహా కేవలం 19 దిర్హంల సేవా చార్జీ మాత్రమే వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
400 మందికి పైగా సిబ్బంది నియామకం
విస్తృత సేవల నిర్వహణ కోసం అల్ హింద్ ఇప్పటికే 400 మందికి పైగా సిబ్బందిని నియమించుకున్నట్లు సమాచారం. సేవలకు సంబంధించిన తాజా వివరాల కోసం అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, తప్పుడు ప్రచారాలను విశ్వసించవద్దని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ అధికారులు సూచించారు.
కొత్త సేవా సంస్థకు బాధ్యతల బదిలీ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఎంబసీ స్పష్టం చేసింది.
టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక
భారత రాయబార కార్యాలయం 2025 నవంబర్‌లో అబుధాబిలోని ఎంబసీ, దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌కు సంబంధించిన పలు కాన్సులర్ సేవల ఔట్‌సోర్సింగ్ కోసం టెండర్లు ఆహ్వానించింది.
ఈ టెండర్ ప్రక్రియలో అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్, డీయూ డిజిటల్ గ్లోబల్, ఎస్‌జీఐవీఎస్ గ్లోబల్, వీఎఫ్‌ఎస్ గ్లోబల్ సంస్థలు పోటీపడ్డాయి. వీటిలో అత్యల్ప ఆర్థిక బిడ్ సమర్పించిన అల్ హింద్ సంస్థ ఎంపికైనట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









